కరోనా టీకా సామర్థ్యంపై సామాజిక మాధ్యమంలో వదంతులు వ్యాపిస్తున్న వేళ కేంద్రం అప్రమత్తమైంది. టీకా సామర్థ్యంపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిని గుర్తించి వారిపై చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులతో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్ భల్లా మాట్లాడారు.
"భారత్లో తయారైన కొవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలు అత్యంత సురక్షితం. వాటి సామర్థ్యంపై అనుమానాలు అక్కర్లేదు. అయితే వాక్సిన్ల సామార్థంపై సామాజిక మాధ్యమాలలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. అలా తప్పుడు సమాచారం వ్యాప్తితో ప్రజలు ఆందోళన చెందుతారు. టీకాపై తప్పుడు సమాచార వ్యాప్తిని అరికట్టి, అలాంటి వారిపై రాష్ట్ర ప్రభుత్వాలు చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి."
-అజయ్ భల్లా , కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి
ఇదీ చూడండి: 'మన దేశంలో తయారైన వ్యాక్సిన్ ఎంతో సురక్షితం'