చంద్రయాన్-2 ప్రయోగంలో పంపిన ఉపగ్రహంతో భూ కక్ష్యను పెంచే మొదటి ప్రక్రియ విజయవంతమైనట్లు ఇస్రో ప్రకటించింది. మధ్యాహ్నం రెండు గంటల 52 నిమిషాలకు ఈ ప్రక్రియను పూర్తి చేసినట్లు వెల్లడించింది. చంద్రయాన్-2 ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ ద్వారా 170x45,475 కిలోమీటర్ల భూకక్ష్యలో ప్రవేశపెట్టగా...ఆ కక్ష్యను తాజాగా పెంచింది ఇస్రో . పెంచిన కక్ష్యతో ప్రస్తుతం చంద్రయాన్-2 ఉపగ్రహం 230x45,163 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న భూ కక్ష్యలో ఉంది.
రెండో సారి కక్ష్యను పెంచే ప్రక్రియను శుక్రవారం తెల్లవారుజామున చేపట్టనున్నట్లు ఇస్రో తెలిపింది. చంద్రయాన్-2ను చంద్రుడి కక్ష్యలోకి పంపేందుకు నిర్దేశించుకున్న తేదీ ఆగస్టు 14 వరకు ఇలా కక్ష్యలను పెంచే ప్రక్రియలను చేపడతామని ఇస్రో స్పష్టం చేసింది.
ఇదీ చూడండి:'మాజీ ప్రధానుల కోసం దిల్లీలో మ్యూజియం'