ఇస్రో... జులై 22న శ్రీహరికోట నుంచి చంద్రయాన్-2 వ్యోమనౌకను జాబిల్లిపైకి పంపింది. ఆ తర్వాత వివిధ దశల్లో చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్-2 చేరుకుంది. కేవలం 42 రోజుల్లోనే ఆర్బిటర్ నుంచి ల్యాండర్ వేరుపడింది. ఈ ప్రయోగంలో తుది ఘట్టం.. అత్యంత కీలకమైన, క్లిష్టమైన ప్రక్రియ విక్రం ల్యాండర్ చంద్రునిపై అడుగుపెట్టడం.
అగ్రదేశాల సరసన భారత్
ఈ ప్రక్రియ విజయవంతమైతే భారత్ అగ్రదేశాల సరసన నిలుస్తుంది. జాబిల్లి పైకి వ్యోమనౌకలను పంపిన రష్యా, అమెరికా, చైనా తర్వాత నాల్గవ దేశంగా అవతరిస్తుంది. అయితే చందమామ దక్షిణ ధ్రువంపై అన్వేషణకు ప్రప్రథమంగా ప్రయోగం చేపట్టిన తొలి దేశంగా భారత్ చరిత్ర పుటలకెక్కింది.
ఈ నెల 2న విక్రమ్ ల్యాండర్.. ఆర్బిటర్ నుంచి విజయవంతంగా విడిపోయింది. రెండుసార్లు కక్ష్యను కుదించటం ద్వారా చంద్రునికి చేరువైంది. వ్యోమనౌక గమనాన్ని 'ఇస్రో టెలిమెట్రీ'లోని 'మిషన్ ఆపరేషన్ కాంప్లెక్స్', బెంగళూరుకు సమీపంలోని బయాలులోని 'డీప్ స్పేస్ నెట్వర్క్' యాంటెనా సాయంతో 'ట్రాకింగ్ కమాండ్ నెట్వర్క్' నుంచి పర్యవేక్షించారు. ఈ నెల 7న ప్రజ్ఞాన్ రోవర్ కలిగిన విక్రమ్ ల్యాండర్.. చంద్రుని ఉపరితలంపై కాలిడనుంది.
అత్యంత క్లిష్టమైన ప్రక్రియ
ఆ రోజు రాత్రి ఒంటి గంట నుంచి 2 గంటల మధ్య జాబిల్లిపై ల్యాండర్ దిగే ప్రక్రియ మొదలు కానుంది. రాత్రి ఒకటిన్నర, రెండున్నర గంటల మధ్య ల్యాండర్ చంద్రునిపై కాలుమోపనుంది. ప్రస్తుతం ఈ ల్యాండర్ చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టే ప్రదేశానికి 35 కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలో ఉంది. దక్షిణాన 70 అక్షాంశాల మధ్య ఎత్తయిన మైదాన బిలాలు 'మాంజినియస్-C', 'సింప్లియస్-N' మధ్య సాఫ్ట్ ల్యాండింగ్ అవుతుందని ఇస్రో తెలిపింది. గతంలో ఎప్పుడూ చేపట్టని ఈ ప్రక్రియ అత్యంత క్లిషమైనదని ఇస్రో ఛైర్మన్ కె.శివన్ పేర్కొన్నారు.
"30 కిలోమీటర్ల దూరంలోని కక్ష్య నుంచి చంద్రుని ఉపరితలంపై దిగేందుకు 15 నిమిషాల సమయం పడుతుంది. 15 నిమిషాల ఈ ప్రయాణం ఇస్రోకు కొత్త అనుభవం. వాతావరణంలేని చోటికి వ్యోమనౌకను పంపటం ఇది మొదటిసారి. వేగ నియంత్రణ చేసేందుకు ప్రొపల్షన్ విధానం ద్వారా వ్యోమనౌకను సురక్షితంగా ల్యాండింగ్ చేయబోతున్నాం. విక్రమ్ ల్యాండర్ చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టిన తర్వాత ప్రజ్ఞాన్ రోవర్ తెల్లవారుజామున 5.30, ఆరున్నర గంటల ప్రాంతంలో విడిపోతుంది. ఆ తర్వాత ప్రజ్ఞాన్ రోవర్ ఒక రోజు పాటు చంద్రుని ఉపరితలంపై ప్రయోగాలు చేస్తుంది. చందమామపై ఒకరోజు అంటే భూమిపై 14 రోజులతో సమానం. ప్రధాన ఆర్బిటర్ మిషన్ ఏడాది పాటు కొనసాగుతుంది."
-కె.శివన్, ఇస్రో ఛైర్మన్
చంద్రునిపై సుదీర్ఘ కాలం ఉండే విక్రం ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్‌పై జాతీయ చిహ్నాలను ముద్రించారు. రోవర్‌కు ఇరువైపు మూడు చొప్పున ఆరుచక్రాలు ఉన్నాయి. వెనక ఉండే 2 చక్రాల్లో ఒక దానిపై అశోకచక్రం, మరోదానిపై ఇస్రో చిహ్నాన్ని ముద్రించారు. చంద్రుని ఉపరితలంపై రోవర్ దిగేందుకు ఏర్పాటు చేసిన ల్యాండర్ ర్యాంపుపై జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేశారు.
మిషన్ ఖర్చు రూ.978 కోట్లు
చంద్రునిపై మానవరహిత మిషన్ కోసం 978 కోట్లు ఖర్చు చేశారు. చంద్రయాన్-2 ఉపగ్రహం తయారీకి 603 కోట్లు, జీఎస్ఎల్వీ-మార్క్ఎం-1 వాహక నౌకకు 375 కోట్లు వ్యయమయింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఇప్పటివరకూ ఎవరూ పరిశోధనలు చేయలేదు. అందుకే అక్కడ ఏదైనా కొత్త విషయాలు గుర్తించ వచ్చని ఇస్రో శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎక్కువ భాగం నీడలో ఉంటుంది. సూర్యుడి కిరణాలు పడకపోవడం వల్ల ఎక్కువగా శీతలంగా ఉంటుంది.
నీడలో ఉండే ఈ ప్రాంతంలో నీళ్లు, ఖనిజాలు ఉండే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. నీళ్లున్న చంద్రుడి దక్షిణ ధ్రువం.. భవిష్యత్తులో మనుషులు నివసించేందుకు అనువుగా ఉండొచ్చని భావిస్తున్నారు. చంద్రయాన్-2 మిషన్ ద్వారా నీడలో ఉండే చంద్రుని దక్షిణ ధ్రువంపై కాంతి ప్రసరించనుంది.
500 మీటర్ల ప్రయాణం
చంద్రుడి ఉపరితలాన్ని, బాహ్య వాతావరణాన్ని మ్యాపింగ్ చేసేందుకు ఆర్బిటర్ 8 శాస్త్రీయ పేలోడ్లు, ఉపరితలం, ఉప ఉపరితలంపై ల్యాండర్ 3 శాస్త్రీయ పేలోడ్లను జరపనున్నట్లు శివన్ చెప్పారు. చంద్రుడిపై దిగిన తర్వాత బయటకు వచ్చే ప్రగ్యాన్ రోవర్ కూడా చంద్రుడి ఉపరితలాన్ని అర్థం చేసుకునేందుకు రెండు సైంటిఫిక్ పేలోడ్లను జరపనున్నట్లు వివరించారు. రోవర్ సెకండ్‌కు సెంటిమీటర్ వేగంతో చంద్రునిపై సంచరిస్తుంది. తన జీవిత కాలంలో 500 మీటర్లు పూర్తి చేస్తుంది. చంద్రయాన్-2 సాఫ్ట్ ల్యాండింగ్‌తో పాటు చంద్రుని ఉపరితలంపై సంచరించటం సహా ల్యూనార్ మిషన్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేసి ప్రదర్శించటమే ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది.
చంద్రుని ఉపరితలంపై చంద్రయాన్-2 వ్యోమనౌక అడుగుపెట్టే అద్భుత దృశ్యాలను బెంగళూరులోని ఇస్రో కేంద్రంలో ప్రధాని నరేంద్రమోదీ... పాఠశాలల విద్యార్థులతో కలిసి ప్రత్యక్షంగా వీక్షించనున్నారు.
ఇదీ చూడండి:కశ్మీర్లో అంతర్గత యుద్ధానికి పాక్ కుట్ర!