చంద్రయాన్-2 కాసేపట్లో జాబిల్లిపై సురక్షితంగా దిగుతుందన్న దశలో ఇస్రోతో సంబంధాలు కోల్పోయింది 'విక్రమ్ ల్యాండర్'. చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల దూరంలో ఉండగా అంతరిక్ష కేంద్రానికి సంకేతాలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో చంద్రయాన్-2 భవితవ్యంపై ఇస్రో సీనియర్ అధికారి ఒకరు స్పందించారు. ల్యాండర్ పునరుద్ధరణ అంత తేలిక కాదని చెప్పారు. విక్రమ్, ప్రజ్ఞాన్‌ను మనం కోల్పోయినట్లేనని పీటీఐ వార్తా సంస్థతో అన్నారు.
"ల్యాండర్‌తో ఎలాంటి కమ్యూనికేషన్ లేదు. మనం ల్యాండర్‌ను కోల్పోయినట్లే. తిరిగి దక్కుతుందన్న ఆశ లేదు. ల్యాండర్, ఇస్రో మధ్య సంబంధాల పునరుద్ధరణ చాలా చాలా కష్టం."
-ఇస్రో సీనియర్ అధికారి
ఆర్బిటర్ భద్రమే... ఇస్రో
ప్రయోగంలో భాగమైన ఆర్బిటర్ భద్రంగానే ఉన్నట్లు ఇస్రో వెల్లడించింది.
"ఆర్బిటర్ క్షేమంగా ఉంది. సరిగానే పనిచేస్తుంది. జాబిల్లి కక్ష్యలో తిరుగుతోంది."
-ఇస్రో ప్రకటన
2,379 కిలోల బరువుండే ఆర్బిటర్ జీవిత కాలం ఒక సంవత్సరం. చంద్రుడికి 100 కిలోమీటర్ల దూరం నుంచి రిమోట్ సెన్సింగ్ ద్వారా పరిశోధనలు జరుపుతుంది. 8 శాస్త్రీయ పేలోడ్లను కలిగి ఉండే ఆర్బిటర్.... చంద్రుడి ఉపరితలం మ్యాపింగ్, బాహ్య వాతావరణాన్ని అధ్యయనం చేస్తుంది.
ప్రయోగంలో పూర్తి డేటాను విశ్లేషించి, ఏం జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తామని ప్రకటించింది ఇస్రో.
ఇదీ చూడండి: నిరాశ వ్యర్థం... నవోదయం తథ్యం: మోదీ