భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రాజెక్టులో.. విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాల పునరుద్ధరణ కోసం నాసాతో కలిసి ప్రయత్నాలు చేస్తోంది ఇస్రో. నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీ (జేపీఎల్) తన డీప్ స్పేస్ నెట్‌వర్క్ (డీఎస్‌ఎన్)లోని భూ కేంద్రాల ద్వారా విక్రమ్‌కు రేడియో తరంగాలను పంపింది.
దక్షిణ కాలిఫోర్నియాలోని గోల్డ్‌స్టోన్, స్పెయిన్‌లోని మ్యాడ్రిడ్, ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రాలో ఉన్న నాసా డీఎస్‌ఎన్ కేంద్రాల నుంచి 12 కిలోవాట్ల శక్తి కలిగిన రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాలను జాబిల్లి మీదకు ప్రసరింపచేస్తోంది. భూ కేంద్రంతో కమ్యూనికేషన్ సాగించేలా ల్యాండర్‌ను ప్రేరేపించడం దీని ఉద్దేశం. సుదూరపు విశ్వంలోని వ్యోమనౌకలు కనీసం ఏదో ఒక కేంద్రంతో సంబంధాలను కొనసాగించేలా చూడటం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలు సౌర కుటుంబం అంచులవరకూ కమ్యూనికేషన్ సాగించగలవు. ఆ కేంద్రాల్లోని భారీ యాంటెన్నాలతో ఏకకాలంలో అనేక వ్యోమనౌకలతో కమ్యూనికేషన్‌ను సాగించవచ్చు.
రోజులు గడిచేకొద్దీ ల్యాండర్ పునరుద్ధరణ అవకాశాలు సన్నగిల్లిపోతున్నాయి. జాబిల్లిపై 14 రోజుల పగటి సమయం ఈ నెల 20-21తో ముగుస్తుంది. ఆ తర్వాత విక్రమ్‌లోని సౌరఫలకాలకు శక్తి అందదు. ఆ పరిస్థితుల్లో వ్యోమనౌకపై ఆశలు వదులుకోవాల్సిందే.
శోధించనున్న అమెరికా ఆర్బిటర్
మరోవైపు జాబిల్లి కక్ష్యలో తిరుగుతున్న నాసా ఆర్బిటర్ లూనార్ రికానసెన్స్ ఆర్బిటర్ (ఎల్‌ఆర్‌వో) ఈ నెల 17న ‘విక్రమ్’ ఉన్న ప్రదేశం వద్దకు వస్తుంది. అప్పుడు ఆ ప్రాంతాన్ని చిత్రీకరించి, ఇస్రోకు అందజేస్తామని నాసా అధికార ప్రతినిధి తెలిపారు. వాటిలో ల్యాండర్ జాడ కనిపించే అవకాశం ఉంది. ఇప్పటికే చంద్రయాన్-2 ఆర్బిటర్ తీసిన చిత్రాలు ఇస్రోకు అందాయని, ల్యాండర్ ఆకృతి చెక్కుచెదరకుండా ఉందని అందులో తేలినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
విక్రమ్ కోసం గాలింపు జరుగుతున్న నేపథ్యంలో నాసాలోని జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీ, కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (క్యాల్టెక్)కి చెందిన నిపుణులు బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. సంస్థ ఛైర్మన్ కె.శివన్‌తో చర్చలు జరిపారు. ఈ పర్యటన ఉద్దేశం ఏంటన్నది ఇంకా వెల్లడి కాలేదు. భారత అంతరిక్ష విభాగం ఆధ్వర్యంలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఐఎస్‌టీ).. క్యాల్టెక్ భాగస్వామ్యంతో ‘ఆ రెస్ట్’ పేరుతో ఒక కొత్త రకం అంతరిక్ష టెలిస్కోపును నిర్మించనుంది.
ఇదీ చూడండి: చంద్రయాన్-2 ఆర్బిటర్ అత్యుత్తమం: ఇస్రో మాజీ ఛైర్మన్