కేరళలో జరుగుతోన్న ఛాంపియన్ బోట్ లీగ్ (సీబీఎల్)లో భాగంగా 5వ స్నేక్ బోట్ రేస్ పోటీలు కొచ్చి తీరంలో అట్టహాసంగా జరిగాయి. గత నాలుగు పోటీల్లో గెలిచి.. వరుస విజయాలతో దూసుకెళుతున్న నడుభాగం జట్టుకు ఛంబకులమ్ జట్టు షాకిచ్చింది. 17 మిల్లీ సెకన్ల తేడాతో తొలిస్థానాన్ని కైవసం చేసుకుంది.
960 మీటర్ల పోటీ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. మూడు జట్లు నువ్వానేనా అన్నట్లు పోటీపడ్డాయి. కేవలం క్షణాల వ్యవధిలోనే స్థానాలు మారిపోయాయి. ఛంబకులమ్ జట్టు 3 నిమిషాల 17.99 సెకన్లలో గమ్యాన్ని చేరుకుంది. నడుభాగం జట్టు 3 నిమిషాల 18.16 సెకన్లలో చేరింది. కరిచల్ జట్టు 3 నిమిషాల 18.41 సెకన్లతో మూడోస్థానంలో నిలిచింది.
5వ పోటీల అనంతరం సీబీఎల్ లీగ్‌లో 68 పాయింట్లతో నడుభాగం జట్టు మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఛంబకులమ్ జట్టు 37 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. దేవాస్ జట్టు 34 పాయింట్లతో 3వ స్థానంలో ఉంది. ఈ పోటీల్లో మొత్తం 9 జట్లు పాల్గొన్నాయి.
రాష్ట్ర పర్యటక శాఖ కార్యదర్శి రాణి జార్జ్ ఈ పోటీలను ప్రారంభించారు. పి.బాలకిరణ్, నటుడు తొవినో థామస్.. విజేతలకు బహుమతులు అందించారు. ఈ పోటీల ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ముందుగా చిన్న బోట్ల పోటీలు నిర్వహించారు. కేరళ సంప్రదాయ నృత్యాలు, కళలు.. ప్రదర్శించారు.
తదుపరి సీబీఎల్ పోటీలు..
త్రిసూర్‌లోని కొట్టపురమ్లో ఈనెల 12న 6వ పోటీలు జరగనున్నాయి. అక్టోబర్ 19న మల్లపురమ్లోని పొన్నానిలో 7వ పోటీలు, నవంబర్ 2న అలెప్పీలోని పులింకున్నులో 8వ పోటీలు, నవంబర్ 16న కొల్లమ్‌లోని కల్లడలో 9వ పోటీలు, నవంబర్ 23న కొల్లంలో ప్రెసిడెంట్ ట్రోఫీ జరగనుంది.
ఇదీ చూడండి: ముంబయి: 2,600 వృక్షాల రక్షణకై ఆందోళనలు