ఉల్లి.. ఈ మధ్యకాలంలో కోయకుండానే సామాన్యులను ఏడిపిస్తోంది. రోజురోజుకు ధర పెరుగుతూ బంగారంలా మారిపోతోంది. ఇప్పటికే దేశంలోని పలు రిటైల్ మార్కెట్లలో కేజీ ఉల్లి కనీసం.. రూ.75 ధర పలుకుతోంది. అయితే ఆకాశాన్నంటుతున్న ఉల్లి రేట్లను కట్టడి చేసేందుకు ఇటీవలే దిగుమతి నిబంధనలను సడలించిన కేంద్ర ప్రభుత్వం.. మరిన్ని చర్యలు చేపట్టింది. కేంద్రం ఆధ్వర్యంలో ఉన్న బఫర్ స్టాక్ నుంచి ఉల్లిని తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది.
"ఉల్లి ధరల నియంత్రణకు చర్యలు ప్రారంభించాం. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు బఫర్ స్టాక్ నుంచి ఉల్లిని తీసుకోవాలని కోరుతున్నాం. ఫలితంగా సరఫరా పెంచి రిటైల్ మార్కెట్ ధరలను కట్టడిచేయవచ్చు"
--లీన్ నందన్, వినియోగదారుల మంత్రిత్వశాఖ కార్యదర్శి
అసోం, ఆంధ్రప్రదేశ్, బిహార్, చండీగఢ్, హరియాణా, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు ఈ ఆఫర్‌కు అంగీకరించాయి. బఫర్ నుంచి దాదాపు 8వేల టన్నుల ఉల్లిని తీసుకునేందుకు ఈ రాష్ట్రాలు ముందుకొచ్చాయని లీన్ పేర్కొన్నారు. మిగతా రాష్ట్రాల నుంచి స్పందన కోసం ఎదురుచూస్తున్నట్లు ఆమె తెలిపారు.
కేజీ 86పైనే..
వినియోగదారుల మంత్రిత్వశాఖ ప్రకారం.. అక్టోబర్ 22 నాటికి ముంబయిలో కేజీ ఉల్లి రూ.86 ఉండగా.. చెన్నైలో రూ.83, కోల్‌కత్తాలో రూ.70, దిల్లీలో రూ.55గా ఉంది.
బఫర్ స్టాక్‌లో లక్ష టన్నుల ఉల్లి ఉండగా.. ప్రస్తుతం 30వేల టన్నుల సరకును రాష్ట్రాలకు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది కేంద్రం. ఇదంతా 2019-20 కాలంలో రబీ కాలంలో సేకరించిన పంటేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. త్వరలో ఖరీఫ్ సాగు రూపంలో 37 లక్షల టన్నులు మార్కెట్లకు వస్తాయని.. ఫలితంగా సరఫరా పెరిగి ధరలు తగ్గొచ్చని ఆశాభావం వ్యక్తం చేసింది.
దాస్తే చర్యలే...
మార్కెట్‌లోకి మరింత ఉల్లిని అందుబాటులోకి తెచ్చి.. ధరలను తగ్గించేందుకు వాటి నిల్వలపై డిసెంబర్ 31 వరకు పరిమితి విధించింది కేంద్రం. రిటైల్ వ్యాపారులు 2 టన్నుల వరకు, హోల్‌సేల్ వ్యాపారులు 25 టన్నుల వరకు మాత్రమే ఉల్లిని నిల్వ చేసుకోవాలని స్పష్టం చేసింది. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై ఇటీవల పార్లమెంటు ఆమోదించిన నిత్యావసర వస్తువుల సవరణ చట్టం ప్రకారం.. చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది. త్వరగా పాడయ్యే అవకాశం ఉన్న వస్తువుల ధరలు అసాధారంగా పెరిగితే... వాటిని నియంత్రించే బిల్లును కేంద్ర ప్రభుత్వం గత నెలలో పార్లమెంటులో ప్రవేశపెట్టింది.