పౌరసత్వ చట్టం రాజ్యాంగ ప్రామాణికత పిటిషన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది కేంద్రం. రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ వివిధ హైకోర్టుల్లో దాఖలై పెండింగ్లో ఉన్న వ్యాజ్యాలను సర్వోన్నత న్యాయస్థానానికి బదిలీ చేయాలని కోరింది.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఈ నెల 10న వాదనలు విననున్నట్లు స్పష్టం చేసింది.
''సీఏఏను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టులే విచారించాలని మేం ప్రాథమికంగా భావించాం. అయితే.. అందులో ఏమైనా వివాదం ఉంటే కనుక మేం పరిశీలిస్తాం.''
- సుప్రీం ధర్మాసనం
కేంద్రం తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా... వివిధ హైకోర్టులు విరుద్ధ అభిప్రాయాలను వ్యక్తం చేయొచ్చని, అదే సమస్య అని అన్నారు. విచారణ కోసం న్యాయవాదులు కూడా వివిధ రాష్ట్రాలకు తిరగాల్సి ఉంటుందని వివరించారు.
అంగీకారం... స్టే...
డిసెంబర్ 18న పౌరసత్య చట్టం రాజ్యాంగ ప్రామాణికతను పరిశీలించేందుకు అంగీకరించింది సుప్రీం కోర్టు. కానీ.. ఈ చట్టం అమలుపై స్టే విధించేందుకు నిరాకరించింది.
పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ నుంచి వచ్చే శరణార్థులకు భారత పౌరసత్వం కల్పించేందుకు ఈ చట్టం వీలు కల్పిస్తోంది. అయితే.. దీనిని వ్యతిరేకిస్తూ పలు సంఘాలు, రాజకీయ నేతలు దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.