దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో హిందీ భాషను తప్పనిసరి చేసేలా ఉన్న జాతీయ విద్యావిధానం ముసాయిదాకు కేంద్రం మార్పులు చేసింది. మానవ వనరుల శాఖ సిఫారసును అమలు చేయకుండా వెనక్కి తగ్గింది.
హిందీ భాషను బలవంతంగా తమపై రుద్దొద్దని దక్షిణాది రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో కేంద్రం నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.
పాత విధానం ప్రకారం 3-8ఏళ్ల వయసు మధ్య పిల్లలు హిందీ సహా మూడు భాషలు నేర్చుకోవాలన్న సూచనను తాజాగా ఎత్తివేశారు. ఇక నుంచి పిల్లలు తమకు నచ్చిన ఏవైనా మూడు భాషల్ని ఎంచుకునే వెసలుబాటును కల్పించారు.
‘త్రిభాషా సిద్ధాంతంలో వెసులుబాటు’ పేరిట చేసిన ఈ సవరణలో ‘‘విద్యార్థులు అభ్యసించాల్సిన మూడు భాషల్లో మార్పులు చేసుకోవడానికి ఆరు లేదా ఏడో తరగతిలో అవకాశం ఉంటుంది. అయితే వారికి మాధ్యమిక స్థాయిలో నిర్వహించే బోర్డు పరీక్షల్లో ఏదైనా మూడు భాషల్లో ప్రావీణ్యం ప్రదర్శించడం మాత్రం తప్పనిసరి. బోర్డు పరీక్షల్లో భాషా నైపుణ్యాల్ని కేవలం ప్రాథమిక అంశాల ఆధారంగానే పరీక్షిస్తారు. నాలుగేళ్లలో ఆ నైపుణ్యాల్ని నేర్చుకోవడం సాధ్యమయ్యే విషయమే. బోధనావసతులు అనుకూలించిన పక్షంలో ఆరోతరగతిలో భాషను మార్చుకోవడం విద్యార్థులకు సాధ్యమయ్యే అంశమే.