దేశంలో కరోనా కేసులు వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. పలు రాష్ట్రాల్లో బాధితులు రికార్డ్ స్థాయిలో పెరుగుతున్నారు. దీంతో మహమ్మారి తీవ్రత అధికంగా ఉన్న మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణలో క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ బృందాన్ని నియమించింది. ఈ బృందానికి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ నేతృత్వం వహించనున్నారు. ఈ బృందం ఈ నెల 26 నుంచి 29 వరకు ఆ రాష్ట్రాల్లో పర్యటించనుంది. కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన అన్ని చర్యలపై ఆయా రాష్ట్రాల అధికారులతో కేంద్ర బృందం సభ్యులు చర్చించనున్నారు.
పరీక్షల సామర్థ్యం పెంపు...
కరోనా వ్యాప్తి అధికమవుతోన్న నేపథ్యంలో నిర్ధరణ పరీక్షల సామర్థ్యాన్ని పెంచింది కేంద్రం. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా మొత్తం 1,007 ల్యాబ్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీటిలో 734 ప్రభుత్వ, 273 ప్రైవేట్ ల్యాబ్లు ఉన్నాయి.
పరీక్ష ల్యాబ్ల వివరాలు...
- రియల్ టైం పీసీఆర్ ల్యాబ్లు 559 (ప్రభుత్వం: 359, ప్రైవేట్: 200)
- ట్రూనాట్ ల్యాబ్లు 364 (ప్రభుత్వం: 343, ప్రైవేట్: 21)
- సీబీఎన్ఏఏటీ ల్యాబ్లు 84 (ప్రభుత్వం: 32, ప్రైవేట్: 52)
దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కలిపి ఇప్పటి వరకు 75, 60,782 పరీక్షలను నిర్వహించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. వీటిలో గడిచిన 24 గంటల్లో 2 లక్షలకు పైగా చేసినట్లు పేర్కొంది.
రికవరీ రేటు 57 శాతం..
కరోనా బాధితులు ఎక్కువ అవుతున్నటికీ కోలుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో 13 వేల మంది కోలుకున్నట్లు చెప్పింది. దేశంలో మొత్తం 2,71,696 మంది ఇప్పటివరకు వైరస్ను జయించారు. దీంతో దేశంలో రికవరీ రేటు 57.43 శాతంగా ఉంది. 1,86,514 మంది దేశంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
లక్ష మందిలో ఒకరు మాత్రమే..
దేశంలోని జనాభాతో పోలిస్తే మరణాల రేటు చాలా తక్కువగా ఉందని ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇప్పటివరకు ప్రతి లక్ష మందిలో ఒకరు మాత్రమే మహమ్మారితో చనిపోయినట్లు చెప్పింది. ప్రపంచ జనాభాలో సగటున ఆరుగురు కరోనాతో మృతి చెందినట్లు వివరించింది.
ఇదీ చూడండి:మద్యం తాగి పడుకుంటే.. మూత్రాశయం పగిలింది