జమ్ము కశ్మీర్లో పరిస్థితిని అంచనా వేసేందుకు కేంద్రమంత్రులు ఒక్కొక్కరుగా పర్యటించనున్నారు. కశ్మీర్లో అభివృద్ధి కార్యక్రమాల అమలు పర్యవేక్షణతో పాటు అక్కడి ప్రజలతో మంత్రులు మమేకం అయ్యేలా ప్రణాళికలను కేంద్రం రూపొందించినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఇద్దరు కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అర్జున్ ముందా లద్దాఖ్‌లో పర్యటించారు. అధికరణ 370 రద్దు చేసినప్పటి నుంచి కశ్మీర్ లోయలో ఎవరూ పర్యటించలేదు. ఈ నేపథ్యంలో వేర్వేరుగా కేంద్ర మంత్రులు లోయలో వ్యక్తిగతంగా పర్యటించి అక్కడి పరిస్థితులను గమనిస్తారు.
మంత్రులకు లక్ష్యాల నిర్దేశం
లోయలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కేంద్ర మంత్రులు, వారి శాఖలకు పలు లక్ష్యాలను ప్రభుత్వం నిర్దేశించిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. మంత్రుల పర్యటనను కేబినెట్ వ్యవహారాల శాఖ కార్యదర్శి పరిశీలిస్తారు.
నాయకుల విడుదల!
ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో కశ్మీర్లో అదుపులోకి తీసుకున్న నేతలను ఒక్కొక్కరిగా విడుదల చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
"మొట్టమొదటిగా జనసంచారానికి అనుమతి ఇచ్చారు. తర్వాత టెలిఫోన్ సేవలను పునరుద్ధరించారు. నెమ్మదిగా కొన్ని ప్రాంతాల్లో మొబైల్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఇదే విధంగా సమయాన్ని బట్టి అదుపులో ఉన్న రాజకీయ నాయకులను విడుదల చేస్తారు."
- ప్రభుత్వ ఉన్నతాధికారి
ఇదీ చూడండి: కశ్మీర్ విభజన, అభివృద్ధిపై కేంద్రం ముమ్మర కసరత్తు