మొక్కవోని దీక్షతో దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతు సంఘాలతో చర్చలను పునః ప్రారంభించేందుకు కేంద్రం సుముఖత వ్యక్తంచేసింది. చర్చలకు సిద్ధమని రైతు సంఘాలు చేసిన ప్రతిపాదనపై సానుకూలత వ్యక్తంచేసింది. ఈనెల 30న దిల్లీ విజ్ఞాన్ భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు చర్చలకు రావాలని కోరింది. దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న 40 రైతు సంఘాలను చర్చలకు ఆహ్వానిస్తూ కేంద్ర వ్యవసాయశాఖ కార్యదర్శి సంజయ్ అగర్వాల్ లేఖ రాశారు. 3 సాగు చట్టాలు, మద్దతు ధరలకు కొనుగోళ్లు, విద్యుత్ చట్టసవరణ బిల్లు, దిల్లీ చుట్టుపక్కల వాయు కాలుష్యం నివారణకు జారీచేసిన ఆర్డినెన్స్‌పై సవివరంగా చర్చిద్దామని లేఖలో పేర్కొన్నారు. ఐతే నూతన సాగు చట్టాల రద్దుకు సంబంధించి రైతు సంఘాలు చేసిన మరో సూచనను కేంద్ర వ్యవసాయశాఖ కార్యదర్శి తన లేఖలో అసలు ప్రస్తావించలేదు. ఆయా అంశాలపై సమగ్రంగా చర్చించి తగిన పరిష్కారం కనుగొనేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మాత్రమే లేఖలో స్పష్టంచేశారు.
రైతుల అసంతృప్తి..
కేంద్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించడంపై రైతు సంఘాలు పెదవి విరిచాయి. తమ అజెండాను కేంద్రం ఒప్పుకోవడం లేదని, సమస్య పరిష్కారానికి సుముఖంగా లేదని అభిప్రాయపడ్డాయి. కేంద్రం చాలా తెలివిగా మాటలతో మాయ చేయాలని చూస్తోందని రైతు సంఘాలు వ్యాఖ్యానించాయి. చర్చలకు సిద్ధమంటూ.. రెండు నాలుకల ధోరణిని కేంద్రం అవలంభిస్తోందని ఆరోపించాయి. ఆందోళనలు మరింత ఉద్ధృతంగా కొనసాగుతాయని రైతు సంఘాల నేతలు స్పష్టంచేశారు. హరియాణాలో టోల్ రుసుముల నిరాకరణ, కార్పొరేట్ ఉత్పత్తుల బహిష్కరణ కొనసాగుతోందన్నారు.
నూతన సంవత్సరవేడుకల సందర్భంగా రైతులకు మద్దతుగా ప్రమాణం చేయాలని కర్షక సంఘాల నేతలు పిలుపునిచ్చారు. 30న సింఘు సరిహద్దు వద్ద ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించినట్లు అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి వెల్లడించింది. కేంద్రంతో చర్చలకు వెళ్లడంపై రేపటిలోగా రైతు సంఘాలు స్పష్టత ఇచ్చే అవకాశముంది.
అబద్ధాల గోడ త్వరలోనే కూలిపోతుంది..
సాగు చట్టాలపై దుష్ప్రచారం చేస్తూ కొందరు కావాలనే రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తెలిపారు. వారు నిర్మించిన అబద్ధాల గోడ త్వరలోనే కూలిపోతుందని చెప్పారు. రైతులు నిజాన్ని తెలుసుకుంటారని, త్వరలోనే ఈ సమస్యకు న్యాయసమ్మతమైన పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త సాగుచట్టాలకు మద్దతిస్తున్న రైతుసంఘాలతో నిర్వహించిన సమావేశంలో కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
ఐదు సార్లు విఫలం...
కేంద్రం, రైతు సంఘాల మధ్య ఇప్పటివరకు ఐదు సార్లు చర్చలు జరిగాయి. చట్టాల రద్దు తప్ప మరే ఇతర ప్రతిపాదనలకు రైతులు ఒప్పుకోకపోవడం వల్ల చర్చలన్నీ ఎలాంటి పురోగతి లేకుండానే ముగిశాయి. నూతన చట్టాలను రద్దు చేయకపోతే తమ ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని రైతు సంఘాలు ఇప్పటికే స్పష్టం చేశాయి.
33వ రోజు..
33వ రోజూ దిల్లీ సరిహద్దుల్లో కర్షకుల ఆందోళన కొనసాగింది. సింఘు, టిక్రీ, ఘాజిపూర్, చిల్లా వద్ద రోడ్లపై బైఠాయించిన అన్నదాతలు...సాగు చట్టాలు రద్దుచేసే వరకూ తగ్గబోమని పునరుద్ఘాటించారు. కొందరు రైతులు త్రివర్ణ పతాకం రంగులను శరీరంపై వేయించుకుని ఆందోళన చేశారు.