కేంద్ర ఎన్నికల కమిషన్‌లో సీనియారిటీ పరంగా రెండో స్థానంలో ఉన్న ఎన్నికల కమిషనర్ అశోక్ లవాసా మంగళవారం రాజీనామా చేశారు. ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) ఉపాధ్యక్షుడిగా నియమితులైన ఆయన వచ్చే నెలలో ఆ బాధ్యతలు చేపట్టడానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు తన రాజీనామా సమర్పించారు.
ప్రస్తుతం ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఉన్న సునీల్ అరోడా వచ్చే ఏడాది ఏప్రిల్‌లో పదవీ విరమణ చేయనున్నారు. ఆయన తర్వాత ఆ బాధ్యతలు చేపట్టాల్సి ఉన్నప్పటికీ అశోక్.. ఆ అవకాశాన్ని వదులుకున్నారు. ఫలితంగా ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న సుశీల్ చంద్రకు సునీల్ అరోడా తర్వాత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం దక్కింది.
రెండో కమిషనర్‌గా..
2022 అక్టోబర్‌లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌గా పదవీ విరమణ చేసే అవకాశం ఉన్నప్పటికీ అశోక్ లవాసా ముందే పదవీత్యాగం చేశారు. గడువు ముగియకముందే పదవి వదులుకున్న రెండో కమిషనర్‌గా రికార్డులకెక్కారు. 1973లో కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా ఉన్న నాగేంద్రసింగ్.. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్‌లో న్యాయమూర్తిగా నియమితులు కావడం వల్ల ముందే తన పదవికి రాజీనామా చేశారు.
అశోక్ లవాసా కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన తర్వాత 2018 జనవరిలో ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు.
ఇదీ చూడండి: 'ఎన్నికల నిర్వహణకు మూడు రోజుల్లో కొత్త రూల్స్'