వైద్య విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కేంద్ర వైద్య మండలి స్థానంలో జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ)ను తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం.
విద్యార్థులకు ఉపశమనం
ఎండీ, ఎంఎస్ వంటి పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రస్తుతం ఉన్న 'నీట్-పీజీ' పరీక్షలకు బదులు ఎంబీబీఎస్ చివరి సంవత్సరంలో నిర్వహించే జాతీయ ఎగ్జిట్ పరీక్ష (నెక్స్ట్) సరిపోతుందని ఈ బిల్లులో కేంద్రం ప్రతిపాదించింది. బిల్లు ఆమోదం పొందితే వైద్య విద్యార్థులకు భారీ ఉపశమనం లభించనుంది. ఇకపై పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు జాతీయ ఎగ్జిట్ పరీక్ష ఫలితాలే ఆధారం కానున్నాయి.
ఈ మేరకు బుధవారం భేటీ అయిన కేంద్ర మంత్రి వర్గం మరికొన్ని బిల్లులకు ఆమోదం తెలిపింది.
పాత చట్టాల రద్దు
కాలం చెల్లిన చట్టాలను రద్దు చేసే ప్రక్రియను కొనసాగిస్తున్న మోదీ సర్కారు తాజాగా మరో 58 పురాతన చట్టాల్ని తొలగించేందుకు రంగం సిద్ధంచేసింది. ఇందుకు సంబంధించిన బిల్లును కేబినెట్ ఆమోదించింది. తద్వారా మోదీ సర్కారు ఇప్పటివరకూ 1,824 పురాతన చట్టాలను రద్దు చేసింది. ఇప్పటికే పార్లమెంటు ఆమోదం పొందిన మరో 137 చట్టాలను త్వరలో రద్దు చేయనుంది.
నిరర్ధక ఆస్తులుపై..
నిరర్ధక ఆస్తుల సమస్యలను సకాలంలో పరిష్కరించేలా దివాలా చట్టంలో ఏడు సవరణలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ సవరణల ద్వారా దివాలా దరఖాస్తు చేసుకున్న సంస్థ ఆస్తులకు వీలైనంత ఎక్కువ విలువ లభించేలా చూడడం సహా కచ్చితమైన కాలవ్యవధి నిర్దేశించేందుకు ప్రభుత్వానికి అవకాశం లభిస్తుంది.
ఇదీ చూడండి: ఎన్ఐఏ చట్ట సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం