కరోనా మహమ్మారి సోకి మరణించిన వారిలో వృద్ధులదే అధిక వాటా! అరవై ఏళ్లకు పైబడిన వ్యక్తులే ఎక్కువగా మరణించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే మధ్యప్రదేశ్‌లోని ఓ వృద్ధురాలు కరోనాను విజయవంతంగా ఓడించింది. ఈ బామ్మ వయసు ఎంతో తెలుసా? ఏకంగా 105 ఏళ్లు. మధ్యప్రదేశ్‌లో కరోనాను జయించిన అత్యంత పెద్ద వయస్కురాలు ఈవిడే కావడం మరో విశేషం.
వైద్యుల సూచనల వల్లే..
నీమచ్ జిల్లాలోని ధకడ్ ప్రాంతానికి చెందిన మురీబాయి జూన్ 18న కరోనా బారిన పడింది. జిల్లా ఆస్పత్రిలో చేరిన ఆ వృద్ధురాలు 11 రోజుల్లోనే వైరస్ నుంచి కోలుకుంది. జూన్ 29న వైరస్ పరీక్షల్లో నెగటివ్‌గా తేలింది. అనంతరం.. ఆమెకు ఎలాంటి వైద్య సమస్యలు లేవని డాక్టర్లు ఇంటికి పంపించేశారు. వైద్యులు చెప్పిన అన్ని విషయాలను మురీబాయి తూ.చ. తప్పకుండా పాటించిందని అధికారులు తెలిపారు. ఫలితంగానే.. కరోనా నుంచి కోలుకున్నట్లు వెల్లడించారు.
మురీబాయి చిత్తశుద్ధి, పట్టుదలను అభినందిస్తూ కాలనీవాసులంతా ఘనంగా స్వాగతం పలికారు. చప్పట్లు కొట్టి అభినందించారు.
మధ్యప్రదేశ్‌లో ప్రస్తుతం 2,607 మంది కరోనా చికిత్స పొందుతున్నారు. 10,199 మంది వైరస్ నుంచి కోలుకోగా.. 564 మంది మరణించారు.
ఇదీ చదవండి- మిడతలను తరిమికొట్టేందుకు బరిలోకి ఎయిర్‌ఫోర్స్