కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్‌కు సంబంధించిన అక్రమాస్తుల కేసులో సోమవారం.. కర్ణాటక, దిల్లీ, మహారాష్ట్రలోని 14 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది కేంద్ర దర్యాప్తు సంస్థ. దాదాపు రూ. 57లక్షలను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించింది. శివకుమార్‌పై ఉన్న నేరాలను రుజువు చేసేందుకు ఉపయోగపడే కీలక పత్రాలను కూడా సేకరించినట్టు స్పష్టం చేసింది.
శివకుమార్ ఇంట్లో, కుటుంబ సభ్యుల నివాసాలపై ఈ సోదాలు ఉదయం నుంచి జరుగుతున్నాయి. ఆయన కుటుంబ సభ్యులకు రూ.74.93 కోట్ల ఆస్తులున్నాయని ఆరోపణలు ఉన్నాయి.
మరోవైపు ఇతర సంస్థల నుంచి అందిన సమాచారంతో కాంగ్రెస్ నేతపై కొత్త కేసు వేసింది సీబీఐ. ఇది కర్ణాటక మంత్రిగా ఆయన విధులు నిర్వర్తించిన సమయంలోని అక్రమాస్తులకు సంబంధించినదని పేర్కొంది.
రాజకీయ రగడ...
సీబీఐ సోదాలపై రాజకీయ దుమారం రేగింది. కర్ణాటకలో వచ్చె నెల 3న జరగనున్న ఉపఎన్నికల నేపథ్యంలో సీబీఐ సోదాలు నిర్వహించడాన్ని కాంగ్రెస్ నేతలు తప్పుబట్టారు. భాజపా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. భాజపా.. ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య ఆరోపించారు.
అయితే ఇందులో ప్రతీకారం ఏమీ లేదని... తనపై పడ్డ మచ్చ నుంచి క్లీన్ చిట్ పొందేందుకు శివకుమార్‌కు ఇది సరైన అవకాశమని భాజపా నేతలు చెబుతున్నారు.
ఇదీ చూడండి:- 'మాల్యాను రప్పించేందుకు రహస్య ఆపరేషన్'