సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగ్ రేపు జరగనుంది. ఎన్నికల వేళ.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈసీ పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. శాంతియుత వాతావరణంలో పోలింగ్ జరిగేలా చర్యలు తీసుకుంటోంది.
ఐదో దశలో భాగంగా 7 రాష్ట్రాల్లోని 51 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో 14, రాజస్థాన్‌లో 12, పశ్చిమ్ బంగ, మధ్యప్రదేశ్‌లలో 7, బిహార్‌లో 5, ఝార్ఖండ్‌లో 4, జమ్ములో 2 లోక్‌సభ స్థానాలకు ఐదో విడతలో పోలింగ్ జరగనుంది. 674 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 8 కోట్ల 75 లక్షల మంది ప్రజలు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు.
సార్వత్రిక ఎన్నికలు తుది దశకు వస్తున్న తరుణంలో.. ప్రధాన పార్టీలన్నీ ఆయా నియోజకవర్గాల్లో ప్రచారాన్ని హోరెత్తించాయి.
ప్రముఖులు...
ఐదో విడతలో పలువురు కేంద్రమంత్రులు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఏఐసీసీ ఛైర్పర్సన్ సోనియాగాంధీ బరిలో నిలిచిన స్థానాల్లో పోలింగ్ జరగనుంది.
మూడు, నాలుగో విడతలో పోలింగ్ జరిగిన జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్ లోక్‌సభ నియోజకవర్గానికి ఈ విడతలోనూ ఓటింగ్ జరగనుంది. ఈసారి పుల్వామా, శోపియాన్ జిల్లాల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతోపాటు జమ్ముకశ్మీర్‌లోని లద్దాఖ్ నియోజకవర్గానికీ పోలింగ్ నిర్వహించనున్నారు.
భారీ భద్రత నడుమ...
పారదర్శకంగా, ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో, హింసాత్మక ఘటనలు జరుగుతున్న పశ్చిమ్‌బంగలో భారీగా భద్రతా బలగాలను మోహరించింది.