దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఉన్నప్పటికీ ఓ తల్లి ఆవేదనను అర్థం చేసుకుని, సాయం అందించింది రైల్వే శాఖ. రాజస్థాన్ నుంచి రైలులో ముంబయికి 20 లీటర్ల ఒంటెపాలను చేరవేసింది.
ఆటిజంతో బాధపడుతున్న తన మూడున్నరేళ్ల కుమారుడికి ఒంటెపాలు అందించాలని ప్రధాని నరేంద్ర మోదీని ట్విట్టర్లో కోరింది ముంబయికి చెందిన నేహా కుమారి. పిల్లాడికి ఆవు, గేదె, మేక పాలు తాగితే సమస్య అని.. లాక్డౌన్ ఉంటుందని తెలియక సరిపడా ఒంటె పాలు నిల్వ చేసుకోలేదని పేర్కొంది. రాజస్థాన్‌లోని సాద్రి నుంచి ఒంటె పాలు, లేదా పాలపొడి తెప్పించే ఏర్పాటు చేయాలని ప్రాధేయపడింది.
ఐపీఎస్ అధికారి చొరవతో..
నేహా ట్వీట్‌ను చూసి సీనియర్ ఐపీఎస్ అధికారి అరుణ్ బోథ్రా చలించిపోయారు. ఆమెకు సాయం అందించేందుకు ప్రయత్నించారు. ఒంటె పాల ఉత్పత్తిని భారత్‌లో మొదటిసారి ప్రారంభించిన అద్విక్ ఫుడ్స్‌ను సంప్రదించారు. పాల పొడిని పంపేందుకు సంస్థ అంగీకరించింది. కానీ రాజస్థాన్ నుంచి ముంబయికి చేరవేయడమే సమస్యగా మారింది.
నేహా ట్వీట్ రైల్వే అధికారుల దృష్టికి వచ్చింది. ఈ విషయంపై చర్చించి లుధియానా నుంచి ముంబయిలోని బాంద్రాకు సరకులు సరఫరా చేసే రైలులో పాలను పార్సిల్ చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రత్యేకంగా రాజస్థాన్‌లోని ఫల్నా స్టేషన్లో రైలును ఆపి పాలు ముంబయికి తరలించారు. అత్యవసరంలో ఉన్నవారికి వీలైన సాయం చేసేందకు ఆలోచించబోమని రైల్వే అధికారులు స్పష్టం చేశారు.
20లీటర్ల ఒంటెపాలు ముంబయిలోని మహిళకు రైల్వే శాఖ చేరవేసినట్లు బోథ్రా ట్విట్టర్లో తెలిపారు.
ఇదీ చూడండి: దోస్త్‌ను సూట్‌కేస్‌లో కుక్కి ఫ్లాట్‌లోకి గప్‌చుప్‌గా...