కేంద్రంలోని ఉద్యోగ నియామక ప్రక్రియకు 'నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ'ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం చారిత్రాక నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో ఈ నిర్ణయానికి ఆమోదముద్ర వేశారు. కేంద్రం నిర్ణయంతో ఉద్యోగార్థులకు మేలు జరగనుందని తెలిపారు కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్.
"ఉమ్మడి అర్హత పరీక్ష నిర్వహణకు నేషనల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో దేశంలోని నిరుద్యోగ యువతకు మేలు జరగనుంది. కేంద్రం ఆధ్వర్యంలో ప్రస్తుతం 20కిపైగా నియామక సంస్థలు ఉండగా.. ఉద్యోగార్థులు అనేక పరీక్షలు రాయాల్సి వస్తోంది. నేషనల్ రిక్రూట్ ఏజెన్సీ నిర్వహించే ఉమ్మడి అర్హత పరీక్షతో అనేక సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రస్తుతం మూడింటికి ఉమ్మడిగా పరీక్షలు నిర్వహిస్తుండగా.. కాలక్రమేణా అన్నింటికీ ఉమ్మడి అర్హత పరీక్ష చేపడతాం."
- ప్రకాశ్ జావడేకర్, కేంద్ర మంత్రి.
విమానాశ్రయాల ప్రైవేటీకరణ..
విమానాశ్రయాల ప్రైవేటీకరణలో మరో ముందడుగు పడింది. పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) పద్ధతిలో విమానాశ్రయాల నిర్వహణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే జైపుర్, గువాహటి, తిరువనంతపురం ఎయిర్‌పోర్టుల లీజు ప్రతిపాదనకూ ఆమోదం లభించినట్లు కేంద్ర మంత్రి జావడేకర్ తెలిపారు. ఉజ్వల్ డిస్కామ్ అస్యూరెన్స్ యోజన కింద డిస్కామ్‌లకు రుణాలు పెంపునకు పవర్ ఫైనాన్స్, రూరల్ విద్యుద్దీకరణ కార్పొరేషన్‌కు కేబినెట్ ఆమోదిచిందన్నారు.
అదానీకి హక్కులు..
ఎయిర్పోర్ట్ అథారటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఆధ్వర్యంలోని లఖ్‌నవూ, అహ్మదాబాద్, మంగళూరు, తిరువనంతపురం, గువాహటి విమానాశ్రయాలను పీపీపీ పద్దతి ద్వారా నిర్వహించేందుకు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు హక్కులు లభించాయి. 2019 ఫిబ్రవరిలో జరిగిన బిడ్డింగ్‌లో ఈ మేరకు అదానీకి అవకాశం లభించింది. అహ్మదాబాద్, మంగళూరు, లఖ్‌నవూ విమానాశ్రయాల కోసం ఈ ఏడాది ఫిబ్రవరి 14న ఏఏఐతో ఒప్పందం చేసుకుంది అదానీ గ్రూప్.
ఇదీ చూడండి: '4 నెలల్లో ఉపాధి కోల్పోయిన 2 కోట్ల మంది'