దిల్లీ అల్లర్ల కేసులో ప్రతివాదిగా కేంద్రం - దిల్లీ హింస
దేశరాజధానిలో అల్లర్లపై దాఖలైన వ్యాజ్యాల్లో కేంద్రాన్ని ప్రతివాదిగా చేర్చేందుకు దిల్లీ హైకోర్టు అంగీకరించింది. ముగ్గురు భాజపా నేతలపై కేసులు ఎందుకు నమోదు చేయలేదో చెప్పాలని కేంద్రాన్ని దిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. నాలుగు వారాల్లోగా సమాధానమివ్వాలని ఆదేశించింది.
ఈశాన్య దిల్లీ అల్లర్లకు సంబంధించి దాఖలైన వ్యాజ్యాల విచారణలో కేంద్రాన్ని పార్టీగా చేర్చేందుకు దిల్లీ హైకోర్టు అంగీకరించింది. విద్వేష ప్రసంగాలు చేసిన ముగ్గురు భాజపా నేతలపై కేసు ఎందుకు నమోదు చేయలేదో వివరణ ఇవ్వాలని కేంద్రం, పోలీసులకు నోటీసులు జారీ చేసింది. సమాధానం ఇచ్చేందుకు నాలుగు వారాల గడువు ఇచ్చింది.
దిల్లీలో శాంతిభద్రతలను పర్యవేక్షించే బాధ్యత కేంద్రానిదే అని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనానికి తెలిపారు. అందువల్ల ఈ వ్యాజ్యాలకు సంబంధించి ప్రతివాదిగా కేంద్రాన్ని చేర్చాలని కోరగా కోర్టు అంగీకరించింది.
"దిల్లీ ఘర్షణలకు సంబంధించి ఇప్పటివరకు 48 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. దేశరాజధానిలో సాధారణ పరిస్థితులు ఏర్పడే వరకు న్యాయవ్యవస్థ జోక్యం ఉండదు. ఈ కేసులన్నీ ఘర్షణలు, లూటీ, మరణాలకు సంబంధించినవే."
- తుషార్ మెహతా, సొలిసిటర్ జనరల్
దిల్లీ అల్లర్లకు సంబంధించి పోలీసులు తీరుపై హైకోర్టు బుధవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ముగ్గురు భాజపా నేతలు అనురాగ్ ఠాకూర్, పర్వేశ్ వర్మ, కపిల్ మిశ్రా విద్వేషపూరిత ప్రసంగాలు చేసినట్లు ఆరోపణలు ఉన్నా.. ఎందుకు స్పందించలేదని ప్రశ్నించింది. అదే రోజు ఈ కేసును విచారిస్తున్న జడ్జిని బదిలీ చేసింది ప్రభుత్వం.
గాంధీ కుటుంబంపైనా వ్యాజ్యాలు..
కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని దిల్లీ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. విద్వేషపూరిత ప్రసంగాలు చేసినందుకు గాను వారిపై కేసులు నమోదు చేయాలని ఈ వ్యాజ్యాల్లోని సారాంశం.
దిల్లీ సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా మీద విద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించి కేసులు నమోదు చేయాలని మరో వ్యాజ్యం దాఖలైంది. ఎంఐఎం నేతలు అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఓవైసీల మీదా ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని హిందూసేన వ్యాజ్యం దాఖలు చేసింది.
ఇలాంటి విద్వేషపూరిత ప్రసంగాల విషయంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించాలని వ్యాజ్యాల్లో పిటిషన్‌దారులు కోరారు.
ఇదీ చూడండి: రాష్ట్రపతిని కలిసిన కాంగ్రెస్- షా రాజీనామాకు డిమాండ్