గ్రామీణ భారతంలో ఆధునిక సౌకర్యాల కల్పనకు ప్రత్యేక చర్యలు చేపడతామని తెలిపారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా 2022 నాటికి గ్రామాల్లోని ప్రతి భారతీయుడికి పక్కా ఇల్లు నిర్మిస్తామని తెలిపారు. గతంలో ఇంటి నిర్మాణానికి ఏడాది కాలం పట్టే సమయాన్ని 114 రోజులకు తగ్గించామన్నారు. రెండో దశ పీఎమ్ఏవైలో 2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరంలో 1.95 కోట్ల ఇళ్ల నిర్మాణం చేపడతామని చెప్పారు. గత ఐదేళ్లలో 1.5 కోట్ల ఇళ్లు నిర్మించామన్నారు.
గ్రామీణ సడక్ యోజన ద్వారా ప్రతి గ్రామానికి రహదారుల నిర్మాణం చేపట్టి పట్టణాలతో అనుసంధానం చేస్తామన్నారు. రూ.80,250 కోట్లతో 1.25 లక్షల కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను వినియోగించి 30 వేల కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారులు నిర్మిస్తామని చెప్పారు.