భారత్, నేపాల్‌లోని గౌతమ బుద్ధునికి సంబంధించిన పర్యాటక ప్రాంతాల కోసం భారతీయ రైల్వే నడిపే ప్రత్యేక 'బుద్ధిస్ట్ సర్క్యూట్ పర్యాటక రైలు' దిల్లీలోని సఫ్దార్ జంగ్‌స్టేషన్ నుంచి శనివారం ప్రారంభం కానుంది. నేపాల్‌లోని బుద్ధుడి జన్మస్థలం లుంబిని సహా భారత్‌లోని బుద్ధుడికి జ్ఞానోదయమైన బోధ్ గయా, తొలిసారి ధర్మోపదేశం చేసిన సారనాథ్, నిర్యాణం చెందిన కుషినగర్ వంటి పలు సందర్శనీయ బౌద్ధ క్షేత్రాలను సందర్శించేలా ఈ రైలు పర్యాటక ప్యాకేజీని రూపొందించారు.
8 రోజులు, 7 రాత్రుల పాటు ఉండే ఈ ఆధ్యాత్మిక, వైజ్ఞానిక యాత్రలో పర్యటకులకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. రైలు దిల్లీ నుంచి బయలుదేరి తొలుత బిహార్‌లోని గయా, రాజ్ గిరి, నలంద అక్కడి నుంచి వారణాసి, సారనాథ్ చేరుకుంటుంది. తర్వాత నేపాల్‌లోని లుంబిని అక్కడి నుంచి కుషినగర్, స్రవస్తి మీదుగా 8వ రోజు ఆగ్రాకు చేరుకోనుంది.
ఎనిమిది కోచ్‌లతో కూడిన ఈ బుద్ధిస్ట్ సర్క్యూట్ రైలులో ఫస్ట్ క్లాస్‌లో 96, సెకండ్ క్లాస్‌లో 60 ఏసీ బెర్తులు అందుబాటులో ఉంటాయి. రెండు కోచ్‌ల్లో పూర్తిగా రెస్టారెంట్, డైనింగ్ హాల్ ఉండగా.. మరో కోచ్‌లో కిచెన్ ఉంది. తేజస్ రైలులో ఉన్న విధంగా పూర్తి సౌకర్యాలతో బెర్తులు ఉన్నాయి. విలాసవంతమైన హోటల్‌ను తలపించేలా కంపార్టుమెంటులు ఉంటాయి.
8 రోజుల యాత్రకు ఒక్కొక్కరికి ఫస్ట్ క్లాస్‌లో లక్షా 23 వేల రూపాయలు, సెకండ్ క్లాస్‌లో లక్ష రూపాయల వరకు ఛార్జీలుగా వసూలు చేస్తారు. బౌద్ధమతానికి సంబంధించిన చారిత్రక ప్రదేశాల సందర్శన కోసం ఎక్కువగా తూర్పు, దక్షిణ, ఈశాన్య ఆసియా దేశాల నుంచి పర్యటకులు వస్తారని అధికారులు తెలిపారు.
"ఈ సీజన్‌లో తొలి బుద్దిస్ట్ సర్క్యూట్ రైలు అక్టోబర్ 19 నుంచి ప్రారంభం కానుంది. బుద్ధుడికి సంబంధించిన చారిత్రక ప్రదేశాలను సందర్శించాలనుకునే వారి కోసం ఈ రైలును నిర్వహిస్తున్నాం. 8 రోజులు, 7 రాత్రుల పాటు ఈ యాత్ర సాగనుంది. బస్సుల్లో తీసుకువెళ్లాల్సిన ప్రాంతాలకు ఛార్జీలు కూడా ఈ ప్యాకేజీలోనే ఉంటాయి." - సిద్ధార్థ్, ఐఆర్‌సీటీసీ అధికార ప్రతినిధి
రైలులో ఉన్న రెస్టారెంట్‌లో పర్యటకుల అభిరుచికి అనుగుణంగా వంటకాలను వడ్డిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఇండియన్ , చైనీస్, థాయ్ సహా పలు రకాల వంటకాలను సిద్ధం చేస్తామని వెల్లడించారు. వంటగదిలో మంటలు రాకుండా కేవలం ఐరన్ ప్లేట్‌లను వేడి చేయడం ద్వారా అత్యాధునికంగా వంట చేసే విధానాన్ని అవలంబిస్తున్నారు.
"బుద్ధిస్టు సర్క్యూట్ రైలుకు అధికంగా ఈశాన్య దేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. చైనీస్, థాయ్, బర్మీస్, సింగపూర్ వంటి ఈశాన్య దేశాల రుచులను వండుతాం. భారత వంటకాలు కూడా ఉంటాయి. ఈ రకాలతో పాటు ఇంకా పర్యాటకుల డిమాండును బట్టి ఏర్పాటు చేస్తాం. అంతర్జాతీయ అతిథులు అధికంగా చెల్లిస్తుంటారు కాబట్టి వారు ఏది కోరుకుంటే అది ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాం." - డేవిడ్, బుద్ధిస్ట్ సర్క్యూట్ రైలు డిప్యూటీ మేనేజర్
బుద్ధిస్ట్ సర్క్యూట్ రైలును ఏడాదికి 12 ట్రిప్పులను నడపాలని ఐఆర్‌సీటీసీ భావిస్తోంది. సెప్టెంబర్ నుంచి మార్చి వరకు 7 నెలల్లో ఈ రైలును నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రతి కోచ్‌కు ఓ భద్రతా సిబ్బంది ఉంటారు. యాత్రలో కాలక్షేపం కోసం బుద్ధుడి జీవిత విశేషాలతో కూడిన ఓ చిన్న గ్రంథాలయం, పాదాలకు మసాజర్ వంటి సౌకర్యాలను సైతం అందుబాటులో ఉంచారు.
- ఇదీ చూడండి: ఈ పెళ్లితో సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని!