బ్రహ్మకుమారీస్ సంస్థాన్ అధినేత్రి, రాజయోగిని దాదీ జానకి అస్తమించారు. కొద్ది రోజులుగా శ్వాసకోశ, కడుపు నొప్పి సమస్యలతో బాధపడుతున్న ఆమె.. 104 ఏళ్ల వయసులో రాజస్థాన్ మౌంట్ అబులోని ఆసుపత్రిలో మృతి చెందారు.
దాదీ జానకి మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధాని మోదీ.
బ్రహ్మకుమారీస్ సారథి దాదీ జానకి సమాజానికి ఎంతో సేవ చేశారు. ఎందరో జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు ఆమె ఎనలేని కృషి చేశారు. మహిళా సాధికారత కోసం జానకి ఎన్నో ప్రయత్నాలు చేశారు.
-నరేంద్ర మోదీ, ప్రధాని
ఖండాంతరాలకు దేశ ఖ్యాతిని తెలియజేసేలా..
రాజయోగిని దాదీ జానకి 1916 జనవరి 1లో ఇప్పటి పాకిస్థాన్లోని సింధ్ రాష్ట్రానికి చెందిన హైదరాబాద్లో జన్మించారు. 21 ఏళ్ల వయసులో ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారు. 1970లో భారతీయ తత్వశాస్త్రం, రాజ యోగా, మానవ విలువలను ఖండాంతరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో విదేశాలకు పయనమయ్యారు.
అందరూ మహిళలే...
మహిళలు నిర్వహిస్తోన్న అతిపెద్ద ఆధ్యాత్మిక సంస్థను మందుండి నడిపించిన ఘనత దాదీ జానకి సొంతం. ఆమె ప్రపంచంలోని 140 దేశాల్లో ఎన్నో సేవా కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందులో 800 కేంద్రాల్లో మహిళలే ముఖ్య అధికారులు. 46వేల మంది మహిళలు సహా సుమారు 20 లక్షల మంది ప్రజలు బ్రహ్మకుమారీస్ సంస్థతో సంబంధం కలిగి ఉన్నారు.