మతం, దేవుడు లేదా దేవతలను చూపిస్తూ టీవీలో ప్రసారమయ్యే ప్రకటనలపై నిషేధం విధించింది బాంబే హైకోర్టు. జస్టిస్ టీవీ నలవాడే, జస్టిస్ ఎమ్జీ శెవాలికర్తో కూడిన ధర్మాసనం ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.
"మతాలు, దేవుడు, దేవతల పేరు మీద ఇలాంటి వస్తువులను అమ్మేందుకు లేదా కొనేందుకు ఎవరైనా ప్రకటనలు ఇస్తే వారిని 2013 బ్లాక్ మేజిక్ చట్టం, అఘోరీ చట్టం కింద విచారించాలి. ఈ అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలపై మాకు నెలలోపు నివేదిక ఇవ్వాలి."
- బాంబే హైకోర్టు
దేవుడి పేరుతో..
హనుమాన్ చాలీసా, దేవతల యంత్రాల పేరుతో టీవీల్లో ప్రసారమవుతోన్న ప్రకటనల్ని నిషేధించాలని కోరుతూ రాజేంద్ర గణపతి రావ్ అనే వ్యక్తి ఔరంగాబాద్ ధర్మాసనం వద్ద 2015లో పిటిషన్ దాఖలు చేశారు.
మూఢనమ్మకాలను నిర్మూలించేందుకు 2013లో బ్లాక్ మేజిక్ చట్టం, అఘోరీ చట్టాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ఇందుకోసం ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక అధికారిని నియమించింది. అయినప్పటికీ ఇలాంటివి పెరిగిపోతున్నాయని పిటిషన్లో ఆయన పేర్కొన్నారు.
ఈ వ్యాజ్యాన్ని పిటిషన్‌దారు కొన్నిరోజులకు ఉపసంహరించుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే ప్రజాహితం దృష్ట్యా విచారణ కొనసాగించాలని ధర్మాసనం నిర్ణయించింది.
- ఇదీ చూడండి: 'జీవించే హక్కు కంటే మత హక్కు ఎక్కువ కాదు'