బంగాల్ వివాదంపై అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ). ఈ కేసులో కీలక ఆధారాలు ధ్వంసమయ్యే ప్రమాదం ఉందని తెలిపింది.
అత్యవసర వ్యాజ్యంగా పరిగణించి విచారణకు స్వీకరించాలని సుప్రీంను కోరింది. సీబీఐ వినతిపై సుప్రీంకోర్టు రేపు వాదనలు వింటామని తెలిపింది. అత్యవసర వ్యాజ్యంగా పరిగణించాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది.
బంగాల్ పోలీసు అధికారులపై చేస్తున్న ఆరోపణలకు తగిన ఆధారాలుంటే కోర్టులో పొందుపరచాలని సీబీఐకి సూచించింది.
కోల్కతా సీపీ సహకరించట్లేదు: సీబీఐ
ఈ కేసు విచారణకు కోల్కతా పోలీస్ కమీషనర్ రాజీవ్ కుమార్ సహకరించట్లేదని సీబీఐ ఆరోపించింది. ప్రతి అంశంలోనూ అడ్డు తగులుతున్నారని, శారద కేసులో ఆధారాలను రాజీవ్ నిర్వీర్యం చేసే ప్రమాదం ఉందని తమ ఫిర్యాదులో పేర్కొంది.
సీబీఐ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహ్తా ఈ అంశాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నో సార్లు సమన్లు జారీ చేసినా రాజీవ్ స్పందించలేదని తెలిపారు.
పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజ్యాంగ పరిరక్షణ దీక్ష చేపట్టిన మరునాడే సీబీఐ సుప్రీంను ఆశ్రయించడం గమనార్హం.