దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో పార్టీ నేతల మధ్య మాటలయుద్ధం జరుగుతోంది. ఫలితాలకు కారణమని పేర్కొంటూ ఒకరినొకరు నేతలు నిందించుకుంటున్నారు. భాజపాపై ఆప్ విజయాన్ని స్వాగతించిన సీనియర్ నేత పి. చిదంబరం లక్ష్యంగా విమర్శలు సంధించారు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ. భాజపాపై ఆప్ గెలుపు అంశమై ప్రోత్సాహకరంగా మాట్లాడటంపై రాష్ట్రాల్లోని కాంగ్రెస్ విభాగాలను మూసేద్దమా అని ప్రశ్నించారు.
"భాజపాపై గెలుపునకు ప్రాంతీయ పార్టీలకు కాంగ్రెస్ అవకాశం కల్పిస్తోందా? అలా కాకపోతే మన ఓటమికి చింతించే బదులు ఆప్ గెలిచిందని సంతోషించడమేమిటి? ఒకవేళ ప్రాంతీయ పార్టీలను ప్రోత్సహించడమే కాంగ్రెస్ లక్ష్యమైతే రాష్టాల్లోని పార్టీ విభాగాలను మూసేద్దామా?"
-శర్మిష్ఠ ముఖర్జీ
విభజన రాజకీయ ఎజెండాతో ప్రమాదకరంగా పరిణమిస్తున్న భాజపాను దేశ ప్రజలు ఓడించారని ఆప్ విజయంపై స్పందిస్తూ వ్యాఖ్యానించారు చిదంబరం. దీనిపైనే సమాధానమిచ్చారు శర్మిష్ఠ.
దివంగత షీలా దీక్షిత్ లక్ష్యంగా..
తాజా ఓటమికి కారణం మాజీ ముఖ్యమంత్రి దివంగత షీలాదీక్షిత్ అని ఏఐసీసీ నేత పీసీ చాకో ఆరోపించారు. 2013 నాటి నుంచే దిల్లీలో కాంగ్రెస్ పట్టు కోల్పోతూ వచ్చిందని అభిప్రాయపడ్డారు.
అయితే చాకో వ్యాఖ్యలకు తోసిపుచ్చారు మరోనేత మిలింద్ దెఓరా. షీలా దీక్షిత్ మచ్చలేని నాయకురాలని అభివర్ణించారు. ఆమె ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కాంగ్రెస్ దిల్లీ విభాగం అత్యంత బలంగా ఉందని పేర్కొన్నారు. మరణానంతరం ఆమెపై ఈ విధమైన వ్యాఖ్యలు సరికాదన్నారు.
ఇదీ చూడండి: కేజ్రీవాల్ కీలక నిర్ణయం- వారికే మంత్రి పదవులు!