భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని పార్టీ ఉపాధ్యక్షుడు దుష్యంత్ కుమార్ తెలిపారు. 45 రోజులకు పైగా సాగిన ఈ కార్యక్రమంలో కొత్తగా 3.78 కోట్ల మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నట్లు చెప్పారు. 2.2కోట్ల మంది చేరుతారని అంచనా వేయగా.. అంతకు మించి విజయవంతమైందన్నారు దుష్యంత్.
జులై 6న భాజపా సిద్ధాంతకర్త శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు.
దేశ వ్యాప్తంగా భాజపాకు 11కోట్ల మంది సభ్యత్వం ఉంది. ఈ కార్యక్రమం ద్వారా మరో 20 శాతం(2.2కోట్లు) మంది కొత్తగా పార్టీలో చేరతారని అంచనా వేసింది పార్టీ అధిష్ఠానం. ఊహించిన దాని కంటే ఎక్కువగా 3 కోట్ల 78 లక్షల 67 వేల 753 మంది నూతనంగా భాజపా సభ్యత్వం తీసుకున్నందుకు హర్షం వ్యక్తం చేశారు దుష్యంత్. మోదీ ప్రజాకర్షణ, అమిత్ షా సంస్థాగత చతురతే ఇందుకు కారణమని విశ్లేషించారు.
మంగళవారంతో ముగిసిన ఈ కార్యక్రమానికి సంబంధించిన తుది డేటాను పరిశీలిస్తే కొత్తగా పార్టీలో చేరిన వారి సంఖ్య 5 కోట్లు దాటే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
యూపీ నుంచే అధికం
భాజపాలో కొత్తగా చేరిన వారిలో ఎక్కువగా ఉత్తర్ప్రదేశ్ నుంచి 65 లక్షల మంది ఉన్నారు. పశ్చిమ బంగ నుంచి 36లక్షల మంది, గుజరాత్ నుంచి 34 లక్షల మంది, దిల్లీ నుంచి 15 లక్షల మంది చేరారు.
పార్టీ సభ్యత్వం తీసుకున్నవారిలో ఎక్కువ మంది మిస్డ్ కాల్ ద్వారా, భాజపా అధికారిక వెబ్సైట్, నమో యాప్ ద్వారా నమోదయ్యారు.
భాజపా సంస్థాగత ఎన్నికలు సెప్టెంబరులో జరగనున్నాయి. జాతీయ మండలి సభ్యుల ఎన్నిక డిసెంబరులో జరగనుంది. కేంద్ర హోంమంత్రిగా ఉన్న అమిత్ షా.. పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకునే అవకాశముంది. ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారు.
ఇదీ చూడండి: ఐఎన్ఎక్స్ కేసులో చిదంబరం అరెస్టు తప్పదా?