జమ్ముకశ్మీర్లో ఎన్నికలు జరగనున్నాయన్న ఊహాగానాల నేపథ్యంలో నేడు భాజపా అగ్రనేతలు... ఆ రాష్ట్ర కమల నేతలతో సమావేశంకానున్నారు. నిత్యం ఉద్రిక్త పరిస్థితులతో వార్తల్లో నిలిచే జమ్ముకశ్మీర్లో అక్టోబరు నెలలో ఎన్నికలు జరిగే అవకాశాలున్నట్టు సమాచారం. అమర్నాథ్ యాత్ర ముగిసిన అనంతరం ఈసీ.. ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించే అవకాశముంది.
ఎన్నికల కోసం వ్యూహరచనలు...
రాష్ట్రంలో భద్రతా పరిణామాలు, ఎన్నికల వ్యూహరచలపై కాషాయ దళ నేతలు చర్చించనున్నారు.
భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జే.పీ. నడ్డా ఆధ్వర్యంలో సమావేశం జరగనుంది. ఈ భేటీలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, పార్టీ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్ రైనా సహా పలువురు సీనియర్ నేతలు పాల్గొంటారని సమాచారం.
పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నడ్డా... త్వరలోనే జమ్ముకశ్మీర్లో పర్యటించే అవకాశాలున్నాయి. పార్టీ కార్యకర్తల్లో ఉత్తేజం నింపి... ఎన్నికల కసరత్తును పర్యవేక్షించనున్నారు.
ఇంకా రాష్ట్రపతి పాలనలోనే...
జూన్ 2018లో భాజపా- పీడీపీ ప్రభుత్వం కూలిపోయింది. అనంతరం కశ్మీర్లో రాష్ట్రపతి పాలన విధించారు. ఇంతకు ముందు విధించిన రాష్ట్రపతి పాలన గడువు ఇటీవలె ముగిసింది. మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ జులై 3న నిర్ణయం తీసుకుంది పార్లమెంట్.
ఇదీ చూడండి:- పాక్లో 72 ఏళ్ల తర్వాత తెరుచుకున్న హిందూ ఆలయం