గతేడాది ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి ఆసక్తికరంగా సాగుతున్న కర్ణాటక రాజకీయాలు.. మరో కొత్త మలుపు తిరిగాయి. సంకీర్ణ కూటమి భవిష్యత్తు మరింత సందిగ్ధంలో పడింది. శనివారం 13 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. వారం కిందటే ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజీనామాతో.. మొత్తం ఆ
సంఖ్య 14కు చేరింది. ఇందులో ముగ్గురు జేడీఎస్ శాసనసభ్యులున్నారు.
వీరి రాజీనామాలు ఆమోదిస్తే ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. అందుకోసం కర్ణాటక ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేపట్టింది. సంక్షోభాన్ని పరిష్కరించేకు బెంగళూరులో సుదీర్ఘంగా చర్చలు జరిపారు కాంగ్రెస్ నేతలు.
సీఎల్పీ నేత ఇంట్లో..
కాంగ్రెస్ సీనియర్ నేత డీకే. శివకుమార్ అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించినా.. ఆ ప్రయత్నాలు ఫలించలేదు. అనంతరం శాసనసభ్యులు.. గవర్నర్‌తో సమావేశమై ముంబయికి చేరుకున్నారు.
తాజా పరిణామాల నడుమ కాంగ్రెస్ నాయకులు చర్యలు ఆరంభించారు. కర్ణాటక కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యుడు కేసీ. వేణుగోపాల్ ఆధ్వర్యంలో.. సీఎల్పీ నేత, మాజీ సీఎం సిద్దరామయ్య ఇంట్లో చర్చలు జరిపారు. తదుపరి ఏం చేయాలోనని ఆలోచించారు.
అమెరికా నుంచి పయనం..
అమెరికాలో ఉన్న ముఖ్యమంత్రి కుమారస్వామి నేడు కర్ణాటక చేరుకోనున్నారు. కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు దినేశ్ గుండూరావు... ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. ఎమ్మెల్యేల రాజీనామాతో ఆయనా అర్ధంతరంగా పర్యటన ముగించుకుంటున్నారు.
అనంతరం... కూటమి నేతలు సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు తమకు టచ్‌లోనే ఉన్నారని, వారు తిరిగొస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు పార్టీ నేతలు. ఈ వ్యవహారం వెనుక ఎవరున్నారో అందరికీ తెలిసిందేనని పేర్కొన్నారు కాంగ్రెస్ నేత అజయ్‌సింగ్.
'మేం ఊహించని సీనియర్ నాయకులు కూడా రాజీనామాలు చేశారు. ఇప్పటికీ కొందరు శాసనసభ్యులు మాతో సంప్రదింపుల్లో ఉన్నారు. తర్వాత ఏం చేయాలి.. సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవాలి అనే అంశంపై చర్చలు జరుపుతున్నాం. రాష్ట్ర కాంగ్రెస్ బాధ్యులు కేసీ వేణుగోపాల్, హోం మంత్రి దీని గురించే చర్చిస్తున్నాం. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను తిరిగి ఎలా రప్పించాలోనని చర్చిస్తున్నాం.'
ఆపరేషన్ కమల్, ఆపరేషన్ లోటస్ ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది. ఇది ఇప్పుడు కాదు.. ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి జరుగుతుంది. ఇప్పుడు బయటపడింది. రాజీనామాల వెనక మేం లేమని భాజపా నేతలు చెబుతున్నారు. దీని వెనక ఎవరున్నారో యావత్ ప్రజానీకానికి తెలుసు.
- అజయ్ సింగ్, కర్ణాటక కాంగ్రెస్ నేత
రాజీనామాలపై స్పీకర్ మంగళవారం నిర్ణయం తీసుకోనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. తాను 11 మంది ఎమ్మెల్యేల రాజీనామాలు మాత్రమే స్వీకరించినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ భవిష్యత్తు ఏంటనేది ఆ రోజే తేలనుంది. గవర్నర్ కూడా ఈ పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉన్నారు. గవర్నర్ ఆహ్వానిస్తే ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని.. ఇప్పటికే ప్రకటించింది భాజపా. ఈ తరుణంలో కన్నడ రాజకీయంలో ఏం జరుగుతుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.