కర్ణాటకలో అధికారం చేజిక్కించుకోవడానికి భాజపా వేగంగా పావులు కదుపుతోంది. 11 మంది కాంగ్రెస్, ముగ్గురు జేడీఎస్ ఎమ్మెల్యేలు కలిపి మొత్తం 14 మంది శాసనసభ్యులు ఇప్పటికే రాజీనామా చేశారు. ఈ నేపథ్యంతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు భాజపా నేడు ధర్నాకు పిలుపునిచ్చింది.
కుమారస్వామి సత్వరమే రాజీనామా చేయాలని రాష్ట్ర కమలదళం అధ్యక్షుడు యడ్యూరప్ప డిమాండ్ చేశారు.
‘‘నేను మా ఎమ్మెల్యేలతో చర్చించాను. రేపు ఉదయం 11 గంటలకు గాంధీ విగ్రహం ముందు ధర్నాకు దిగాలని మేం నిర్ణయం తీసుకున్నాం. కుమారస్వామి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తాం’’ - బీఎస్ యడ్యూరప్ప, కర్ణాటక భాజపా అధ్యక్షుడు
కర్ణాటక రాజకీయాల్లో నాటకీయ పరిణామాలపై మంగళవారం ఉదయం నుంచి యడ్యూరప్ప తమ పార్టీ నేతలతో చర్చలు జరిపారు. రాష్ట్ర గవర్నర్ వాజూబాయి వాలాను బుధవారం ఆయన కలవనున్నట్లు సమాచారం.
కర్ణాటకలో రాజకీయ ప్రతికూల పరిస్థితులకు భాజపాయే కారణమంటూ కాంగ్రెస్ నేతలు కేసీ వేణుగోపాల్, సిద్ధరామయ్య.. గాంధీ విగ్రహం ముందు నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో అదే విగ్రహం ముందు భాజపా ధర్నాకు దిగనుంది.
మరోవైపు, భాజపా నేతలు కొందరు అసెంబ్లీ స్పీకర్ రమేశ్ కుమార్‌ను కలవడానికి ఆయన కార్యాలయం వద్దకు వెళ్లారు. ఆయన అక్కడ లేకపోవడం వల్ల తిరిగి వెళ్లిపోయారు. జులై 12 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో స్పీకర్ను కలవడానికి వచ్చామని, కానీ ఆయన అందుబాటులో లేరని భాజపా నేతలు తెలిపారు.
- ఇదీ చూడండి: కర్ణాటకీయం: జాప్యంతో ఊపిరి పీల్చుకున్న సర్కారు