అక్టోబర్ 21న మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ముందు భాజపా-శివసేన పొత్తుపై నేడు తుది ప్రకటన చేస్తారని వార్తలు వచ్చాయి. సీట్ల సర్దుబాటు విషయంలో రెండు పార్టీల మధ్య ఇంకా చర్చ జరుగుతోన్న నేపథ్యంలో నేటి మీడియా సమావేశం వాయిదా పడిందని పార్టీ నేతల సమాచారం.
ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేలు నేడు సంయుక్త మీడియా సమావేశం నిర్వహిస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను శివసేన సీనియర్ నేత అనిల్ పరబ్ ఖండించారు. నేడు ఎలాంటి సంయుక్త మీడియా సమావేశం లేదని స్పష్టం చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన 50 శాతం సీట్లను డిమాండ్ చేస్తోందని సమాచారం. భాజపా అందుకు సిద్ధంగా లేదని తెలుస్తోంది. మహారాష్ట్ర శాససనసభలో 288 స్థానాలున్నాయి. 2014లో జరిగిన ఎన్నికల్లో భాజపా 122, శివసేన 63 గెలుచుకున్నాయి. కొన్ని నెలల అనంతరం భాజపా ఆహ్వానం మేరకు శివసేన ప్రభుత్వంలో చేరింది.
ఇదీ చూడండి: హైఅలర్ట్: చొరబాటుకు సిద్ధంగా 500 మంది ఉగ్రవాదులు..!