దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపిస్తే రూ. 2కు కిలో పిండి అందిస్తామని హామీ ఇచ్చింది భాజపా. ప్రతి ఇంటికీ శుద్ధ తాగునీరు సరఫరా చేస్తామని వాగ్దానం చేసింది. ఈనెల 8న జరగనున్న శాసనసభ ఎన్నికల కోసం ఈ మేరకు మేనిఫెస్టో విడుదల చేసింది కమలదళం. నగర భవిష్యత్తును మారుస్తామని ఉద్ఘాటించారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ. దిల్లీని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.
సహచర మంత్రులు ప్రకాశ్ జావడేకర్, హర్షవర్ధన్, భాజపా దిల్లీ విభాగం అధ్యక్షుడు మనోజ్ తివారీతో కలిసి ఆయన దిల్లీలో ఎన్నికల ప్రణాళికను విడుదల చేశారు. దేశ రాజధానిలో అభివృద్ధి అనే బుల్లెట్ ట్రైన్‌ను నడిపిస్తామన్నారు గడ్కరీ.
"దిల్లీ భవిష్యత్తుకు దీర్ఘకాలిక ప్రణాళిక అవసరం. 11 లక్షల ప్రజల సంక్షేమం కోసం.. ఏఏ సమస్యలున్నాయో వాటన్నింటి కోసం, దిల్లీని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దే దిశగా కేంద్రమంత్రి హర్షవర్ధన్ నేతృత్వంలోని కమిటీ ఈ ఎన్నికల ప్రణాళిక రూపొందించింది. భారత ప్రభుత్వ రైల్వే ఇంజిన్ బలమైనది. దిల్లీలో కూడా భాజపా ప్రభుత్వం ఉంటే అభివృద్ధి బుల్లెట్ రైలులా దూసుకెళుతుంది. అభివృద్ధి బుల్లెట్ రైలు వేగంగా వెళ్లడానికి మేనిఫెస్టో ప్రణాళిక పత్రం."
-నితిన్ గడ్కరీ, కేంద్రమంత్రి
భాజపా వస్తే పథకాల రద్దు
భాజపా ఎన్నికల ప్రణాళికపై విరుచుకుపడింది అధికార ఆమ్ ఆద్మీ పార్టీ. ప్రస్తుతం ఉచితంగా కల్పిస్తున్న సౌకర్యాలను భాజపా గెలిస్తే రద్దు చేస్తారని.. ఎన్నికల ప్రణాళికతో నిర్ధరణ అయిందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు చేశారు.
"మీరు భాజపాకు ఓటేస్తే మీకు ఉచితంగా కల్పిస్తున్న ఉచిత విద్యుత్, రుసుము రహిత మంచినీరు, టికెట్ లేని ప్రయాణం రద్దు అవుతాయని భాజపా మేనిఫెస్టోలోని అంశాలు నిర్ధరిస్తున్నాయి. ఆలోచించి ఓటు వేయండి."
-అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ ముఖ్యమంత్రి
భాజపా మేనిఫెస్టో 'సంకల్ప్ పాత్ర' కాదని వ్యర్థ పాత్ర అని విమర్శించారు ఆమ్ ఆద్మీ నేత సంజయ్ సింగ్. దిల్లీ ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత ఆరోగ్య పథకాలను భాజపా గెలిస్తే తొలగిస్తారని వ్యాఖ్యానించారు.
ఇదీ చూడండి: 'పైసా వసూల్'పై యోగి సర్కార్‌కు సుప్రీం తాఖీదులు