లోక్‌సభ ఎన్నికల బరిలో ఉండే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది భారతీయ జనతా పార్టీ. 184 మంది అభ్యర్థుల స్థానాలను ఖరారు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసి నుంచి మరోసారి పోటీ చేస్తున్నారు.పార్టీ సీనియర్ నేత అడ్వాణీ ప్రాతినిధ్యం వహించిన గాంధీనగర్ స్థానం అమిత్ షాకి కేటాయించారు. దీంతో ఈ సారి అడ్వాణీ పోటీ చేస్తారా లేదా అనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి.
భాజపా సీనియర్ నాయకుడు జేపీ నడ్డా విలేకరుల సమావేశంలో జాబితా విడుదల చేసి వివరాలు వెల్లడించారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ లఖ్‌నవూ, నితిన్ గడ్కరీ నాగ్‌పుర్ నుంచి పోటీ చేస్తున్నట్లు తెలిపారు. గత ఎన్నికల్లో ఇదే స్థానాల నుంచి వీరిరువురు గెలుపొందారు.
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మరోమారు అమేఠీ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇదే స్థానంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బరిలో ఉన్నారు.
కేంద్ర మంత్రి కిరణ్ రిజిజూ అరుణాచల్ తూర్పు నుంచి పోటీలో ఉన్నారు. వీకే సింగ్, మహేశ్ శర్మాలు తిరిగి గత స్థానాలు ఘజియాబాదు, గౌతమ్ బుద్ధా నగర్ (నోయిడా)ల నుంచి పోటీ చేస్తున్నారు.
మొదటి జాబితాలో ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, తమిళనాడు, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బంగా, రాజస్థాన్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, బిహార్ రాష్ట్రాల స్థానాలకు అభ్యర్థుల పేర్లు ప్రకటించింది భాజపా.