కరోనా లాక్డౌన్ కొనసాగుతున్న వేళ.. కర్ణాటక భాజపాలో అసమ్మతి కుంపటి రగులుకొందని సమాచారం. ముఖ్యమంత్రి యడియూరప్పపై అసంతృప్తిగా ఉన్న భాజపా సీనియర్ నేతలు రహస్య మంతనాలు చేస్తున్నారని తెలుస్తోంది. సీనియర్ నేతలు బసన్ గౌడ పాటిల్ యత్నాల్, ఉమేశ్ కత్తి, మురుగేశ్ నీరానీ అధ్యక్షతన అసంతృప్తి ఎమ్మెల్యేలు రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారని సమాచారం అందింది.
'అవసరమైతే మరో పదవి ఇవ్వండి'
ముఖ్యమంత్రి యడియూరప్పను మార్చాలని.. ఆయనకు మరో పదవి ఇవ్వాలని రెబల్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజులుగా రహస్య సమావేశం అవుతున్న తిరుగుబాటు నేతలు.. నాయకత్వ మార్పునకే మొగ్గు చూపుతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
డిమాండ్లకు తలొగ్గినా..
అయితే సీఎం యడియూరప్పకు కూడా అసమ్మతి నేతలు నిర్వహిస్తున్న రహస్య సమావేశాల గురించి తెలుసని పలువురు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుగుబాటు ఎమ్మెల్యేలతో సంభాషించిన ఆయన.. వారి ఆకాంక్షలను నెరవేర్చేందుకు హామీ ఇచ్చారని, తనతో కలిసిరావాలని అన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే రెబల్ ఎమ్మెల్యేలు సీఎం ప్రతిపాదనకు అంతగా స్పందించలేదని సమాచారం.
ఇదీ చూడండి: 'సరిహద్దు'పై సైనిక, దౌత్య మార్గాల్లో సంప్రదింపులు!