సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్‌బుక్ వ్యవహారం జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రజల హక్కుల రక్షణ, ఆన్‌లైన్ మీడియా దుర్వినియోగం విషయంలో ఫేస్‌బుక్‌కు సమన్లు జారీ చేయాలనుకుంటున్నట్లు కాంగ్రెస్ ఎంపీ, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమిటీ ఛైర్మన్ శశి థరూర్ చేసిన ట్వీట్‌పై భాజపా ఎంపీలు మండిపడుతున్నారు. కమిటీలో ఉన్న తమతో కనీసం చర్చించకుండా ఈ విషయాన్ని ఎలా ప్రకటిస్తారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
స్పీకర్‌కు ఫిర్యాదు
ఈ మేరకు భాజపా ఎంపీ నిషికాంత్ దుబే నేతృత్వంలోని భాజపా నేతల బృందం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు గురువారం ఫిర్యాదు చేసింది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమిటీ ఛైర్మన్‌గా ఉన్న థరూర్.. తమ కమిటీ తరఫున ఫేస్‌బుక్‌కు నోటీసులు జారీ చేస్తామంటూ చెప్పడాన్ని ఓంబిర్లా దృష్టికి తీసుకెళ్లారు. సీనియర్ కాంగ్రెస్ నేతగా ఉన్న థరూర్ ఈ విషయాన్ని బయటకు వెల్లడించే ముందు కనీసం ఈ కమిటీలో ఉన్న తమతో చర్చించలేదని పేర్కొన్నారు.
ఈ ప్యానెల్‌లో సభ్యుడిగా ఉన్న కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాఠోడ్ కూడా స్పీకర్‌కు లేఖ రాశారు. థరూర్ నిబంధనలను అతిక్రమించారని ఆరోపించారు. ఏ సంస్థ ప్రతినిధిని పిలిచారనే విషయంపై తమకు వ్యతిరేకత లేదన్న ఆయన.. ఈ కమిటీలో ఉన్న వారితో చర్చించడానికి బదులుగా థరూర్ మీడియాతో ఈ విషయాన్ని చర్చించారని ఆరోపిస్తూ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.
థరూర్‌ను తొలగించాలి
మరోవైపు, శశిథరూర్‌ను ఈ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా తొలగించాలని ఎంపీ నిషికాంత్ దుబే డిమాండ్ చేశారు.
అధికార పార్టీ భాజపాకు చెందిన నేతల విద్వేషపూరిత ప్రసంగాలు, అభ్యంతరకరమైన పోస్టులను ఫేస్‌బుక్ చూసీచూడనట్లు వదిలేస్తోందని, దీనిపై విచారణ జరిపించాలంటూ కాంగ్రెస్ సహా పలు విపక్షాలు కోరుతున్నాయి.