బిహార్ తర్వాత మధ్యప్రదేశ్‌లోనూ ఉచిత కరోనా వ్యాక్సిన్ ప్రకటన చేసింది అధికార భాజపా ప్రభుత్వం. రాష్ట్రంలో 28 స్థానాలకు అసెంబ్లీ ఉప ఎన్నికల జరగనున్న నేపథ్యంలో తమ మేనిఫెస్టోలో ఈ హామీని చేర్చింది. టీకాతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిన పథకాలను పునరుద్ధరిస్తామని స్పష్టం చేసింది.
ఉచిత కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి ఇప్పటికే సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటన చేసినట్లు భాజపా అధికార ప్రతినిధి రజనీశ్ అగర్వాల్ గుర్తు చేశారు. అయితే, బిహార్‌లో ఉచిత టీకా విషయంలో భాజపా చేసిన ప్రకటనపై విపక్షాలు మండిపడ్డాయి. మధ్యప్రదేశ్‌లోనూ కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. ఎన్నికలకు ముందే ప్రజలకు టీకా అందించాలని భాజపాను డిమాండ్ చేసింది. అసలు కరోనా వ్యాక్సిన్ ఎక్కడుందని ప్రశ్నించింది. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కాషాయం పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించింది.
ఉపఎన్నికలు..
కీలక నేత జ్యోతిరాదిత్య సింధియా వర్గానికి చెందిన 22 మంది ఎమ్మెల్యేల రాజీనామాతో.. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయింది. అనంతరం మరో ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి భాజపాలో చేరారు. మరో 3 స్థానాలు ఎమ్మెల్యేల మరణించిన కారణంగా ఖాళీ అయ్యాయి. ఈ 28 స్థానాలకు నవంబర్ 3న పోలింగ్ జరగనుంది.
ఇదీ చూడండి: భాజపా 'టీకా' ప్రకటనపై విపక్షాల రగడ