భారత నౌకాదళ విశ్రాంత అధికారి కుల్‌భూషణ్ జాదవ్ మరణశిక్షను నిలిపివేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును వివిధ రాజకీయ పార్టీల నేతలు స్వాగతించారు. ఐసీజే తీర్పు భారత దేశానికి అతిపెద్ద విజయంగా రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభివర్ణించారు.
"కుల్‌భూషణ్ జాదవ్ కేసులో ఐసీజే ఇచ్చిన తీర్పు భారత్‌కు అతిపెద్ద విజయం. జాదవ్‌కు న్యాయవాదిని కలుసుకునే అవకాశం కల్పించాలని, అలాగే మరణశిక్షను పునఃసమీక్షించాలని పాకిస్థాన్‌ను ఐసీజే ఆదేశించడం స్వాగతించే నిర్ణయం. ఇది ప్రధాని నరేంద్ర మోదీ దౌత్య విజయం."
-రాజ్‌నాథ్ సింగ్, భారత విదేశాంగ మంత్రి
"సీఐజే-ఐసీజే ఇదో గొప్ప రోజు! ఇది సత్యం సాధించిన విజయం. ఇది మానవ గౌరవాన్ని కాపాడుతుంది. భారతీయులందరినీ రక్షించాలనే మోదీ ప్రభుత్వ నిబద్ధతకు, దౌత్య ప్రయత్నాలకు ఇది నిదర్శనం. ఈ కేసు విషయంలో అద్భుత కృషి చేసిన హరీష్ సాల్వేకి నా అభినందనలు" -అమిత్‌షా, కేంద్రహోంమంత్రి
ఐసీజే తీర్పును మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నట్లు మాజీ కేంద్ర విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ పేర్కొన్నారు. ఇది భారత్‌కు అతిపెద్ద విజయమని పేర్కొన్నారు. జాదవ్ కేసను ఐసీజే ముందు ఉంచడంలో ప్రధాని మోదీ చొరవ చూపారన్న సుష్మా.. ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. న్యాయస్థానం తీర్పు జాదవ్ కుటుంబ సభ్యులకు సాంత్వన చేకూరుస్తుందని ఆమె అన్నారు. ఐసీజే ముందు భారత్ తరపున న్యాయవాది హరీష్ సాల్వే బలంగా వాదనలు వినిపించారని ఆమె కొనియాడారు.
తప్పు మీది కాదు... ఇంగ్లీష్ది...
కులభూషణ్ జాదవ్ కేసులో విజయం మాదే అని పాకిస్థాన్ పేర్కొంది. దీనిపై అధికార భాజపా పార్టీ నేతలు మండిపడ్డారు.
"ఇది మీ తప్పుకాదు... తీర్పు ఇంగ్లీష్‌లో ఇవ్వబడింది."
- గిరిరాజ్ సింగ్, కేంద్రమంత్రి ట్వీట్
సత్యమేవ జయతే..
కుల్‌భూషణ్ జాదవ్ కేసులో భారత్‌కు అనుకూలంగా ఐసీజే తీర్పునివ్వడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. అయితే జాదవ్ భద్రత గురించి ఎలాంటి వివరణలేదు. అతనికి పాకిస్థాన్ న్యాయస్థానాల నుంచి హాని ఉంది అని కాంగ్రెస్ అభిప్రాయపడింది.
"నేను ఐసీజే తీర్పును స్వాగతిస్తున్నాను. ఈ రాత్రి నా ఆలోచనలు పాకిస్థాన్ జైలు గదిలో ఒంటరిగా ఉన్న కుల్‌భూషణ్ జాదవ్ పైనే ఉంటాయి. మనస్థాపానికి గురైన అతని కుటంబానికి ఈ తీర్పు అరుదైన ఉపశమనం, ఆనందం, కొత్త ఆశను కలిగిస్తుంది. అతను ఒక రోజు స్వేచ్ఛగా భారత్‌లోని తన ఇంటికి తిరిగివస్తాడు."-రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ నేత
కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి ప్రియాంక గాంధీ ఐసీజే తీర్పును హృదపూర్వకంగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
"చివరికి న్యాయం గెలిచింది. ఈ సమయంలో భారతదేశం మొత్తం జాదవ్ కుటుంబంతో కలిసి ఆనందాన్ని పంచుకుంటుంది." -ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి
"పాకిస్థాన్ వియన్నా కన్వెన్షన్ ఆర్టికల్ 36ను పూర్తిగా ఉల్లంఘించింది. చట్ట విరుద్ధంగా కుల్‌భూషణ్‌కు మరణశిక్షను విధించింది. ఈ శిక్షను నిలిపివేస్తూ ఐసీజే ఇచ్చిన తీర్పును మేము స్వాగతిస్తున్నాం. సత్యమేవ జయతే!"-రణదీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి
ఐసీజే తీర్పును ఎన్సీపీ స్వాగతిస్తున్నట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ తెలిపారు.
"మేము ఐసీజే తీర్పును స్వాగతిస్తున్నాం. ఈ న్యాయపోరాటంలో గెలిచి జాదవ్ ఇంటికి తిరిగి వస్తాడని నమ్ముతున్నాం." -నవాబ్ మాలిక్, ఎన్సీపీ అధికార ప్రతినిధి
ఇదీ చూడండి: 'జాదవ్ తీర్పుతో న్యాయవాదిగా గర్విస్తున్నా'