"పౌర చట్టాన్ని ఉపసంహరించుకోవాలి. దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ అమలుపై పునరాలోచించుకోవాలి. లేదంటే మీరు(భాజపా) గద్దె దిగక తప్పదు. ప్రజావాణిని విస్మరించకండి."
-మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి.
"పౌర చట్టంతో భారతీయులకు ఎలాంటి సంబంధం లేదు. అది విదేశీయులకు మాత్రమే సంబంధించినది. అందుకే బీజేడీ మద్దతు ఇచ్చింది. అయితే ఎన్ఆర్సీకి మాత్రం మద్దతు ఇచ్చేది లేదని లోక్‌సభ, రాజ్యసభలో మా పార్టీ సభ్యులు స్పష్టంచేశారు."
-నవీన్ పట్నాయక్, ఒడిశా ముఖ్యమంత్రి.
"ఎన్ఆర్సీనా? ఎందుకు? ఎన్ఆర్సీ అమలు చేసే ప్రసక్తే లేదు."
-నితీశ్ కుమార్, బిహార్ ముఖ్యమంత్రి.
ముగ్గురు ముఖ్యమంత్రులదీ ఒకటే మాట.... ఎన్ఆర్సీని తమ రాష్ట్రంలో అమలుకానివ్వమని. మమత అలా అనడం పెద్ద విషయం కాదు. దాదాపు ప్రతి విషయంలోనూ భాజపాతో విభేదిస్తున్నారామె. నవీన్, నితీశ్ ప్రకటనలే ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.
నవీన్... ఒడిశాలోని అధికార బిజూ జనతా దళ్ అధినేత. ఎన్డీఏలో భాగస్వామి కాదు. అయినా... దాదాపు ప్రతి కీలకాంశంలోనూ భాజపాకు మద్దతు ఇస్తూ వస్తోంది బీజేడీ. పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు పార్లమెంటు ఉభయసభల్లో జైకొట్టింది. ఎన్ఆర్సీ విషయంలో మాత్రం నో చెప్పింది.
నితీశ్ పరిస్థితి మరింత భిన్నం. ఆయన స్వయంగా ఎన్డీఏ భాగస్వామ్య పార్టీకి అధినేత. అయినా జాతీయ పౌర పట్టిక విషయంలో మిత్రపక్షం భాజపా వైఖరికి భిన్నంగా స్పందించారు.
ఆ ఇద్దరు మినహా...
పౌరసత్వ చట్ట సవరణ సమయంలో భాజపాతో సానుకూలంగా మెలిగాయి కొన్ని పార్టీలు. కానీ... సీఏఏపై దేశవ్యాప్త ఆందోళనల నేపథ్యంలో అవన్నీ దూరం జరిగాయి. ఈశాన్య రాష్ట్రాల్లో కమలదళానికి మిత్రపక్షాలైన ఎన్పీఎఫ్, ఎన్డీపీపీ, ఎంఎన్ఎఫ్ పార్టీలు మౌనాన్నే ఆశ్రయించాయి. ప్రతిపక్షాల సంగతి సరేసరి. పౌరసత్వ చట్ట సవరణ, జాతీయ పౌర పట్టిక విషయంలో మోదీ సర్కార్‌పై దుమ్మెత్తిపోస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సీఎంలు మినహా భాజపాయేతర పార్టీల పాలనలోని రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తూ ప్రకటనలు చేశారు.
భాజపా మిత్రపక్షాలు సైతం ఎన్ఆర్సీకి వ్యతిరేక వైఖరి అవలంబించడం చర్చనీయాంశమైంది. కాషాయ అజెండాలో అతి కీలకమైన సంస్కరణల అమలులో భాజపా ఏకాకిగా మారిందన్న విశ్లేషణలకు తావిచ్చింది.
"పౌర చట్టం, ఎన్ఆర్సీతో భారతీయులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని కేంద్రం పదేపదే చెబుతోంది. కానీ ఆ సందేశం జనంలోకి సరిగ్గా వెళ్లలేదు. ప్రజల్లో చాలా భయం ఉంది. కానీ ప్రభుత్వం భరోసా కల్పించలేకపోతోంది. ఎన్ఆర్సీ విషయంలో వారు మరింత కసరత్తు చేయాల్సింది. ఎన్ఆర్సీ వస్తే పౌరసత్వం నిరూపించుకునేందుకు ఏం చేయాలో ముందే చెప్పి ఉండాల్సింది. ఇప్పుడు మాత్రం ప్రజల్లో చాలా గందరగోళం ఉంది."
-సుశీల రామస్వామి, రాజకీయ విశ్లేషకులు
సుశీల రామస్వామి దిల్లీ జీసస్ అండ్ మేరీ కళాశాల రాజకీయ శాస్త్రం అసోసియేట్ ప్రొఫెసర్.
లాభమా? నష్టమా??
సంస్కరణల అమల్లో మోదీ సర్కార్ దూకుడు గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అంశాలను(కశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దు వంటివి) ఇట్టే పూర్తి చేసింది. ఇదే తరహాలో పౌర చట్టం, ఎన్ఆర్సీ విషయంలో ముందడుగు వేస్తే రాజకీయంగా లాభం ఉంటుందన్నది భాజపా నేతల విశ్వాసం. అందుకే ఈ రెండింటి విషయంలో పార్టీ వైఖరి మారే ప్రసక్తే లేదన్నది వారి మాట.
"ఎన్ఆర్సీ అమలుకు భాజపా కట్టుబడి ఉంది. ప్రధాని మోదీ సారథ్యంలో గతంలో సాధ్యం కాని కీలక అంశాలపై మేం నిర్ణయాలు తీసుకుని అమలు చేశాం. అప్పుడు వ్యతిరేకత వచ్చినా మేం పట్టించుకోలేదు. ఎన్ఆర్సీ విషయంలోనూ అంతే."
-జేపీ నడ్డా, భాజపా కార్యానిర్వాహక అధ్యక్షుడు
ఇక్కడే మరో చిక్కు ఉంది. హిందుత్వ మంత్రంతో ఎన్నో ఏళ్లు కష్టపడి అసోం, బంగాల్లో రాజకీయంగా బలపడింది భాజపా. ఇప్పుడు ఎన్ఆర్సీ కారణంగా పరిస్థితి తారుమారయ్యే ప్రమాదముంది. అలా జరగకుండా చూడడమే కమలదళం ముందున్న ప్రధాన సవాలు. ఇందుకోసం అనుసరించే వ్యూహం ఎలా ఉండనుందో ఇప్పటికే సంకేతాలిచ్చింది భాజపా. దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ అమలుకు ముందు భాగస్వామ్యపక్షాలు అన్నింటితో సంప్రదింపులు జరుపుతామని చెప్పింది.
"ప్రభుత్వం... సమాజంలోని అన్ని వర్గాలకు ప్రతినిధి. ఇలాంటి సున్నితమైన విషయాలపై "గుర్తింపు రాజకీయాలు" చేయడం తగదు. అలా చేస్తే సమాజంలో చీలిక వస్తుంది. విభిన్న వర్గాలన్నింటినీ ఏకతాటి తెచ్చే వరకు ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించాలి. భిన్న వాదనలను గౌరవించాలి."
-సుశీల రామస్వామి, రాజకీయ విశ్లేషకులు
నేరుగా ప్రజల్లోకి....
పౌర చట్టం, ఎన్ఆర్సీ విషయంలో అధికార పక్షం ద్విముఖ వ్యూహం అనుసరించనున్నట్లు కనిపిస్తోంది. మొదటిది... ఎదురుదాడి. రెండోది... ప్రజల్లో భరోసా నింపడం.
విపక్షాలపై ఎదురుదాడిని ఇప్పటికే ప్రారంభించింది కమలదళం. దిల్లీ రామ్‌లీలా మైదానంలో ఆదివారం జరిగిన బహిరంగ సభతో ఇది మరింత ముమ్మరమైంది.
"పౌర చట్టం, ఎన్ఆర్సీని అడ్డంపెట్టుకుని ముస్లింలను నిర్బంధ కేంద్రాలకు పంపుతామని కాంగ్రెస్ నేతలు, అర్బన్ నక్సలైట్లు వదంతులు వ్యాపిస్తున్నారు. కానీ భారతీయ ముస్లింలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. పౌర చట్టం, ఎన్ఆర్సీ వివక్షాపూరితం అని ఆరోపిస్తున్న వారు ఆ విషయాన్ని నిరూపించాలి. నన్ను ఎదుర్కోలేక ఓటు బ్యాంకు రాజకీయాలు, అసత్యాలు, వదంతులతో దేశాన్ని విభజించేందుకు వారు యత్నిస్తున్నారు. ఎన్ఆర్సీ గురించి అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. అసలు ఎన్ఆర్సీ ప్రతిపాదన గత కాంగ్రెస్ ప్రభుత్వాలదే. ఎన్ఆర్సీపై మా ప్రభుత్వం ఇంకా పార్లమెంటులో, మంత్రివర్గ సమావేశంలో చర్చించలేదు."
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
పౌర చట్టం, ఎన్ఆర్సీపై అనుమానాల నివృతికి క్షేత్రస్థాయి కార్యాచరణకు సిద్ధమైంది భాజపా. 10 రోజుల్లో 3 కోట్ల కుటుంబాలను కలిసి 250 మీడియా సమావేశాలు నిర్వహించేలా ప్రణాళిక రచించింది.
'పౌరసత్వం'పై అంతకంతకూ వేడెక్కుతున్న ఈ రాజకీయం మున్ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.