జమ్ముకశ్మీర్ జెండా తమ చేతికి తిరిగి వచ్చాకే.. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తామన్న పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టింది భాజపా. దేశద్రోహ వ్యాఖ్యలు చేసినందుకు ముఫ్తీని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. ఆర్టికల్ 370ని పునరుద్ధరించటం, రాష్ట్ర జెండాను ఎగురవేసే అధికారం ఈ భూమి మీదే లేదని పేర్కొంది.
"మెహబూబా ముఫ్తీ చేసిన దేశద్రోహ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని లెఫ్టినెంట్ గవర్నర్ను కోరుతున్నాం. దేశ ద్రోహ చట్టం కింద అరెస్ట్ చేసి జైలుకు పంపాలి. జాతీయ జెండా, దేశం, మాతృభూమి కోసం ప్రతి రక్తపు బొట్టును దారబోస్తున్నాం. జమ్ముకశ్మీర్ దేశంలో అంతర్భాగం. ఇక్కడ ఒకటే జెండా ఎగురుతుంది."
- రవీందర్ రైనా, జమ్ముకశ్మీర్ భాజపా అధ్యక్షుడు.
ఖండించిన కాంగ్రెస్..
త్రివర్ణ పతాకంపై మెహబూబా ముఫ్తీ చేసిన వ్యాఖ్యలను ఖండించింది కాంగ్రెస్. అలాంటి వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని, అవి ప్రజల మనోభావాలను దెబ్బతీస్తాయని పేర్కొంది. మువ్వన్నెల జెండా దేశ గౌరవానికి ప్రతీకని, స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన కోట్లాది మంది భారతీయుల త్యాగాలను గుర్తు చేస్తుందని పేర్కొన్నారు జేకేపీసీసీ అధ్యక్షుడి ప్రతినిధి రవీందర్ శర్మ. అలాంటి వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని సూచించారు.
తొలిసారి మీడియా ముందుకు ముఫ్తీ..
14 నెలల గృహ నిర్బంధం అనంతరం తొలిసారి మీడియా ముందుకు వచ్చిన మెహబూబా ముఫ్తీ.. భాజపాపై విమర్శలు గుప్పించారు. రాజ్యాంగాన్ని భాజపా నాశనం చేసిందని ఆరోపించారు. గతేడాది రాజ్యాంగంలో జరిగిన మార్పులు.. వెనక్కి తీసుకునేంత వరకు ఎన్నికల్లో పోటీ చేయనన్నారు.
ఇదీ చూడండి: 'కశ్మీర్ జెండా తిరిగొస్తేనే జాతీయ పతాకానికి జై'