బిహార్ శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్ శుక్రవారం విడుదలైంది. ఆ రాష్ట్రంలోని 243 నియోజకవర్గాలకు.. మూడు దశల్లో పోలింగ్ నిర్వహించనుంది ఈసీ. అక్టోబర్ 28న తొలి దశ పోలింగ్ ప్రారంభం కానుంది. కరోనా విజృంభణ తర్వాత దేశంలో జరుగుతున్న తొలి రాష్ట్ర స్థాయి ఎన్నికలు ఇవే కావడం గమనార్హం. బిహార్ అసెంబ్లీ ప్రస్తుత గడువు నవంబరు 29తో ముగియనుంది.
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత.. ఆయా పార్టీలు గెలుపు తమదంటే తమదని ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
మూడొంతులు పక్కా..
బిహార్ ఎన్డీఏ కూటమి నాలుగింట మూడొంతుల మెజార్టీ సాధిస్తుందని చెప్పింది భాజపా. తమ పార్టీ, కూటమి ఎన్నికల కోసం సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ఈ మేరకు మాట్లాడారు భాజపా నేత, కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్. నితీశ్ కుమార్ సారథ్యంలోని ఎన్డీఏ సుపరిపాలనకే ప్రజలు ఓటేస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈసారి కొత్త అధ్యాయం..
ఎన్డీఏ కూటమి నుంచి విడిపోయి.. ఈ ఏడాది ఒంటరిగానే పోటీ చేయాలని భావిస్తున్న లోక్‌జన్‌శక్తి పార్టీ(ఎల్జేపీ) నేత చిరాగ్ పాసవాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో కచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి కాంక్షించే కొత్త అధ్యాయం మొదలవుతుందని చెప్పారు. 'అభివృద్ధి చెందిన బిహార్' అనే మోదీ కలను తాను ఐదేళ్లలో నెరవేర్చిచూపుతానని అభిప్రాయపడ్డారు పాసవాన్. తన తండ్రి ఆసుపత్రిలో ఉన్న విషయాన్ని చెప్పారు. ఆయన సలహాలు, సూచనలు తీసుకోలేకపోతున్నామని పాసవాన్ భావోద్వేగం చెందారు.
మహాకూటమి గెలుపు తథ్యం..
బిహార్ ఎన్నికల్లో మహాకూటమి గెలుస్తుందని జోస్యం చెప్పారు కాంగ్రెస్ నేత రాజీవ్ శుక్లా. రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వాలు చేపట్టిన ప్రజా వ్యతిరేక విధానాల గురించి ఇంటింటి ప్రచారం చేస్తామని చెప్పారు శుక్లా. వ్యవసాయ బిల్లుల విషయం ప్రస్తావించిన ఆయన.. తమ ప్రభుత్వం మ్యానిఫెస్టోలో పెట్టిన ఐదు అంశాలను పరిగణనలోకి తీసుకోలేదని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా బిల్లులు ఆమోదించారని ఆరోపించారు. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్తామని పేర్కొన్నారు.