భారతీయ జనతా పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశమైంది. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ అభ్యర్థులను ఖరారు చేసేందుకు సమావేశమైనట్లు తెలుస్తోంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్ షా, కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, దిల్లీ భాజపా అధ్యక్షుడు మనోజ్ తివారీ సహా పలువురు కీలక నేతలు హాజరయ్యారు.
దిల్లీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మంగళవారమే అభ్యర్థులందరినీ ప్రకటించిన నేపథ్యంలో భాజపా తమ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉంది.
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా భాజపా, ఆప్, కాంగ్రెస్‌లే ప్రభావం చూపనున్నట్లు తెలుస్తోంది. ఈ త్రిముఖ పోరులో ముఖ్యంగా భాజపా, ఆప్‌ల మధ్యే పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దిల్లీలో అమలు చేసిన సంక్షేమ పథకాలపై దృష్టిసారిస్తూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికలకు వెళ్తుండగా... అనుమతుల్లేని కాలనీ నివాసితులకు యాజమాన్య హక్కులు కల్పించడం సహా పౌరసత్వ చట్టం వంటి అంశాలే ప్రచార అస్త్రాలుగా భాజపా ముందుకెళ్తోంది.
ఇదీ చదవండి: 'కే-9 వజ్ర' యుద్ధ ట్యాంకును ఆవిష్కరించిన రాజ్‌నాథ్