బిహార్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాల కారణంగా పలు చోట్ల పిడుగులు పడి 16 మంది మృతి చెందారు. మరో 24 గంటల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
పిడుగులు పడి గయాలో నలుగురు, పూర్ణియాలో ముగ్గురు, బెగుసారై, జముయిలో ఇద్దరు, పట్నా, సహర్సా, తూర్పు చంపారన్, మాధేపుర, దర్భంగా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృత్యుఒడికి చేరినట్లు ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారి తెలిపారు.
పిడుగులు పడి మృతి చెందిన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితిశ్‌కుమార్. మరణించిన ఒక్కొక్కరి కుటుంబాలకు 4 లక్షల చొప్పున పరిహారం అందివ్వాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 160 మంది చనిపోయారు. వీరిలో జూన్ 25న ఒక్కరోజే 83 మంది పిడుగు పాటుకు బలయ్యారు.
ఇదీ చూడండి:కరోనా పరిహారం నిర్ణయాధికారం ప్రైవేటుదే