బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ఎంత ఉత్కంఠగా జరిగాయో.. ఆ తర్వాతి పరిణామాలు కూడా అంతే రసవత్తరంగా సాగుతున్నాయి. మొన్నటికి మొన్న కీలకమైన విద్యాశాఖను జేడీయూ నేత మేవాలాల్‌కు అప్పగించడం వివాదానికి దారితీయడంతో ఆయనకు మంత్రి పదవి మూడు రోజుల ముచ్చటే అయ్యింది. అదలా ముగిసిందో లేదో.. మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఎన్నికల్లో నేతలు సమర్పించిన అఫిడవిట్లు తప్పులతడకగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పుట్టినతేదీపై చాలా మంది నేతలు సరైన వివరాలు ఇవ్వలేదట. దీంతో తాజా అఫిడవిట్ల ప్రకారం.. బిహార్ ఉపముఖ్యమంత్రి తార్ కిశోర్ ప్రసాద్ వయసు ఐదేళ్లలో 12ఏళ్లు పెరగడం గమనార్హం.
ఐదేళ్ల క్రితం 2015 ఎన్నికల్లో కిశోర్ ప్రసాద్ తన వయసును 52 ఏళ్లుగా పేర్కొన్నారు. అయితే 2020 అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్‌లో తనకు 64ఏళ్లని ప్రకటించారు. దీంతో గడిచిన ఐదేళ్లలో ప్రసాద్ వయసు 12ఏళ్లు పెరిగినట్లయింది. అయితే ప్రసాద్ వయసుపై గందరగోళం ఈనాటిది కాదట. 2005 ఎన్నికల నుంచీ ఈయన ఇలాంటి విరుద్ధమైన సంఖ్యలే పేర్కొనడం గమనార్హం. 2005 ఎన్నికల అఫిడవిట్‌లో తన వయసు 48ఏళ్లుగా ప్రకటించిన ప్రసాద్.. ఆ తర్వాత 2010 ఎన్నికల సమయంలో తన వయసును 49ఏళ్లుగా పేర్కొన్నారు. ఇక 2015 ఎన్నికల అఫిడవిట్‌లో 52ఏళ్లని ప్రకటించారు. దీంతో ప్రసాద్ వయసుపై ప్రతిపక్ష ఆర్జేడీ విమర్శలకు దిగింది. అయితే దీనిపై కిశోర్ ప్రసాద్ స్పందిస్తూ.. క్లరికల్ పొరబాట్ల వల్లే అఫిడవిట్లలో తన వయసు తప్పుగా వస్తోందని అన్నారు.
అయితే జేడీయూ నేతలే కాదు.. ఆర్జేడీ కీలక నేతల అఫిడవిట్లలో కూడా తప్పులు ఉన్నట్లు తాజాగా తెలిసింది. అఫిడవిట్ల ప్రకారం.. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ వయసు ఆయన అన్న తేజ్ ప్రతాప్ కంటే ఒక సంవత్సరం ఎక్కువగా ఉందట. ప్రమాణపత్రంలో తేజస్వీ తనకు 31ఏళ్లని పేర్కొనగా.. తేజ్‌ప్రతాప్ మాత్రం 30ఏళ్లని ప్రకటించినట్లు సమాచారం. 2015 ఎన్నికల సమయంలోనూ తేజస్వీ తనకు 26ఏళ్లని చెప్పగా.. తేజ్ ప్రతాప్ మాత్రం 25ఏళ్లనే ప్రకటించారు. దీంతో తేజస్వీ అఫిడవిట్లపై విచారణ జరపాలని ఆ సమయంలో భాజపా డిమాండ్ చేసింది.
వీరే కాదు.. అన్ని పార్టీలకు చెందిన డజనకు పైగా మంది నేతలు తమ వయసు విషయంలో కచ్చితమైన వివరాలు ఇవ్వలేకపోవడం గమనార్హం.
ఇదీ చూడండి: 'బిహార్ ఎన్నికల్లో 1197 మంది అభ్యర్థులకు నేరచరిత్ర'