ప్రతిభావంతులకు నిలయం భారత్.. అని మరోసారి నిరూపించాడు బిహార్ కటిహార్‌కు చెందిన రివన్ రాజ్. స్కొలాస్టిక్ అసెస్మెంట్ టెస్ట్(సాట్)లో ప్రపంచంలోనే మూడవ 3వ ర్యాంకు సాధించి సత్తా చాటాడు. 100 శాతం స్కాలర్‌షిప్‌తో అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఆస్ట్రో ఫిజిక్స్ చదివే అవకాశం దక్కించుకున్నాడు.
ఉన్నత చదువులు చదువుకుని, పరిశోధన చేసేందుకు విదేశాలకు వెళ్తున్నా.. దాని ప్రతిఫలం మాత్రం భారత్‌కే అంకితమని చెబుతున్నాడు రివన్.
"ఈ 'సాట్' పరీక్ష మూడంచెలుగా జరిగింది. మొదటి పరీక్షలో ప్రపంచవ్యాప్తంగా 20 లక్షల మంది పాల్గొన్నారు. ఆ తరువాత రెండో పరీక్షకు అర్హత సాధించాను. ఇక ఆఖరి పరీక్షకు భారత దేశం నుంచి 10మంది ఎంపికయ్యాం. ఆ తరువాత నాకు 100శాతం స్కాలర్షిప్ వచ్చినట్టు ఈ-మెయిల్ పంపారు. సొతంగా విశ్వవిద్యాలయాన్ని ఎంపిక చేసుకునే అవకాశం ఉండటం వల్ల నేను యునివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాను ఎంచుకున్నా. నేను చదువకోడానికి బయట దేశానికి వెళ్తున్నాను.. కానీ, నా ప్రాజెక్ట్ నేను భారత్ కోసమే చేస్తాను." - రివన్ రాజ్.
రివన్ నాలుగేళ్ల చదవుకు అయ్యే ఖర్చంతా అమెరికా ప్రభుత్వమే భరించనుంది. బాగా చదువుకుని దేశం పేరు నిలబెడతానని ధీమాగా చెబుతున్నాడు. తన విజయానికి తన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులే కారణమని తెలిపాడు.
కలల సాకారానికి తొలి అడుగు..
ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న రివన్.. తొమ్మిదో తరగతి నుంచే శాస్త్రవేత్త అవ్వాలని కలలు కనేవాడు. ఎప్పుడూ చదువులో ముందుండే రివన్కు బాల్యంలోనే ముంబయి ఐఐటీలో.. తన ప్రాజెక్ట్‌ను ప్రదర్శించే అవకాశం వచ్చింది.
అప్పటి నుంచి వెనుదిరగని రివన్.. ఇంధనం అవసరం లేకుండా నడిచే ఇంజిన్లను తయారు చేయాలని నిశ్చయించుకున్నాడు. తద్వారా కాలుష్యాన్ని తగ్గించడమే కాదు, ఇంధనం కోసం దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాలకూ తెర వేయగలమని బలంగా నమ్ముతున్నాడు రివన్.
తన ఆలోచనను వాస్తవరూపానికి తీసుకువచ్చేందుకు ఎంతో మందిని సంప్రదించాడు రివన్. ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ)లోనూ ప్రయత్నించాడు. తన ఆలోచనను ప్రశంసిస్తూ పీఎంఓ పంపిన లేఖ తనకెంతో స్ఫూర్తినిచ్చిందంటున్నాడు. తాజాగా సాట్‌లో ప్రపంచంలోనే మూడవ 3వ ర్యాంకు సాధించి తల్లిదండ్రుల పేరు నిలబెట్టాడు.
సాట్ అంటే?
అమెరికా సహా వివిధ దేశాల్లోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు.. ప్రపంచంలోని కొందరు ప్రతిభావంతులకు ష్కాలర్‌షిప్‌లు ఇచ్చి తమ కళాశాలల్లో చేర్చుకుని ప్రోత్సహిస్తున్నాయి. స్కొలాస్టిక్ అసెస్మెంట్ టెస్ట్(సాట్)లో ఉత్తీర్ణులైన వారికి ఈ అవకాశం ఉంటుంది. అమెరికాలో కాలేజ్ బోర్డ్ అనే సంస్థ.. ఏటా 200 దేశాలకు ఒకేసారి ఈ సాట్ పరీక్ష నిర్వహిస్తోంది.