బిహార్లోని శివహర్ జిల్లాలో జనతా దళ్ రాష్ట్రవాదీ పార్టీ అభ్యర్థి శ్రీనారాయణ్ సింగ్ హత్యకు గురయ్యారు. హథ్సర్ గ్రామంలో ఆయనను దుండగులు కాల్చి చంపారు. కాల్పుల్లో గాయపడ్డ సింగ్ అనుచరుడు సంజయ్ మరణించాడు. ఈ ఘటన పట్ల కోపోద్రికులైన స్థానికులు ఓ నిందితుడిపై దాడి చేసి ప్రాణాలు తీశారు. మృతి చెందిన నిందితుడిని జావెద్గా గుర్తించారు.
శ్రీనారాయణ్ సింగ్ హత్యకు సంబంధించి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈ కాల్పులు జరిగినట్లు తెలిపారు.
"ఎన్నికల ప్రచారం సందర్భంగా అభ్యర్థితో పాటు అతని అనుచరులపై దాడి జరిగింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించాం. నిందితులు పారిపోతున్న సమయంలో ఇద్దరిని అరెస్టు చేశాం. దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కాల్పుల్లో నలుగురు, ఐదుగురికి సంబంధం ఉంది."
రాకేశ్ కుమార్, సబ్ డివిజనల్ పోలీసు అధికారి
ఈ ఘటనపై నిరసన వ్యక్తం చేస్తూ ఆస్పత్రి ఎదుట స్థానికులు ధర్నాకు దిగారు. దీంతో బలగాలను మోహరించారు పోలీసులు.