బిహార్ ఎన్డీఏ ప్రభుత్వంలో ఒక మంత్రి.. తన పదవి నుంచి వైదొలిగారు. అవినీతి ఆరోపణలతో విద్యాశాఖ మంత్రి మేవాలాల్ చౌధరీ రాజీనామా చేశారు. 3 రోజుల క్రితం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయనకు మంగళవారం.. విద్యాశాఖను కేటాయించారు. అయితే.. గురువారం మధ్యాహ్నం ఆయన బాధ్యతలు చేపట్టగా.. గంటల వ్యవధిలోనే ఆయన పదవి నుంచి వైదొలగడం గమనార్హం.
తారాపుర్ నియోజకవర్గం నుంచి జేడీయూ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన మేవాలాల్.. గతంలో బిహార్ భగల్పుర్లోని వ్యవసాయ వర్సిటీకి వైస్ ఛాన్స్లర్గా పనిచేశారు. ఆ సమయంలోనే బిహార్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో టీచర్లు, టెక్నీషియన్ల నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో విపక్షాల విమర్శల నడుమ ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది.