మధ్యప్రదేశ్ భోపాల్‌లో లూడో ఆటలో కూతురిని ఓడించిన ఓ తండ్రి.. విపరీత పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఓటమిని అంగీకరించలేక, నాన్నపై ద్వేషాన్ని పెంచుకుని కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది ఆ కూతురు. దీంతో ఇంటిల్లిపాది కోర్టులోని మానసిక వైద్యుల వద్ద కౌన్సిలింగ్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఓడిన కూతురి వేదన..
లూడోలో ఓడి, తన మనసులో రగలుతున్న జ్వాలలను ఇంట్లో చెప్పుకోలేక ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించిన కూతురు.. కోర్టు కౌన్సిలర్ సరిత రజనితో వింత అనుభవాలు పంచకుంది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...
'మా నాన్నకు మేము ముగ్గురు సంతానం. అందరిలో చిన్నకూతురిని కాబట్టి నన్నే అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. అమ్మ కూడా లేదు కాబట్టి మరింత గారం చేశాడు. నాన్న ప్రేమలో మరో ప్రపంచం తెలియకుండా పెరిగాను. ఇప్పుడు నాకు 24 ఏళ్లు. కొద్ది రోజుల క్రితం వరకు నాన్న నన్ను ఎప్పటిలాగే ప్రేమించేవాడు. కానీ, ఈ లాక్డౌన్ వేళ ఇంటిల్లిపాది కూర్చొని లూడో ఆట మొదలెట్టాం.
లూడోలో మొదటి సారి నా టోకెన్‌ను చంపి నాన్న నన్ను ఓడించాడు. అప్పుడే నా మనసు ముక్కలైంది. ఆ తర్వాత 7 ఏర్లు నా టోకెన్లను చంపి బయటకు పంపాడు. ఒక్కో టోకెన్‌ను చంపుతున్నప్పుడు ఇన్నాళ్లు నాన్నపై పెంచుకున్న నమ్మకం, ప్రేమ, ఆప్యాయత... అన్నీ ఒక్కొక్కటిగా కూలిపోయినట్లు అనిపించింది. ఎక్కడా లేని కోపం, విపరీతమైన అసహ్యం ఏర్పడింది.
నేనూ చదువుకున్నదాన్నే, తెలివైనదాన్నే కానీ.. నాన్న తలచుకుంటే నా కోసం ఓడిపోయేవాడు. నాన్నకు నాపై ప్రేమే లేదు అందుకే ఆయన నా టోకెన్లను చంపాడు. ఈ ప్రశ్నలే నన్ను కలచివేశాయి. నాన్నను నాన్న అని నోరారా పిలవడం మానేశా. అయినా, నాకు ఆ బాధ తగ్గట్లేదు. '.... అంటూ తనలోని వేదనను వివరించింది ఆ కూతురు.
గెలవడమే నేర్పిస్తే ఇంతే..
లూడోలో ఓడిన కూతురికి, ఆ కుటుంబానికి నాలుగు సార్లు కౌన్సిలింగ్ ఇచ్చారు భోపాల్ ఫ్యామిలీ కోర్టు కౌన్సిలర్, సరిత రజని. పిల్లలను గారం చేయాలి కానీ, వారికి జీవితంలోని సత్యాలను వివరించకుండా పెంచితే విపరీత పరిణామాలు ఎదుర్కోవాల్సిందే అంటున్నారు .
"బాల్యం నుంచే పిల్లలకు జయాపజయాలను పరిచయం చేయాలి. ఈ రెండూ జీవితంలో సర్వసాధారణమని తెలపాలి. ఓడినా తిరిగి నిలబడాలి అని వివరించాలి. ఆటను ఆటగా చూడాలని నేర్పించాలి. అవసరమైనప్పుడు ఓ అడుగు వెనక్కి తగ్గడం అలవాటు చేయాలి. క్షమాపణ చెప్పడం, క్షమించడం నేర్పాలి. లేకపోతే, 24 ఏళ్ల వయసులో ఈ కూతురు పడిన ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. "
-సరిత రజని, ఫ్యామిలీ కోర్టు కౌన్సిలర్
ఇదీ చదవండి: అరుదైన శస్త్రచికిత్సతో తిరిగొచ్చిన రెండు చేతులు!