ప్లాస్టిక్ రహిత సమాజం కోసం చిన్న సాయమైనా చేయాలని భావించి సరికొత్త ఆలోచనకు ప్రాణం పోశారు ఛత్తీస్‌గఢ్ భిలాయ్‌కు చెందిన సామాజిక కార్యకర్త శ్రద్ధ సాహు. విందు కార్యక్రమాల్లో ఉపయోగించే ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్లకు బదులుగా స్టీల్ సామగ్రిని ఉచితంగా అందిస్తున్నారు.
ఇందుకోసం స్టీల్ పాత్రల బ్యాంకును ఏర్పాటు చేశారు శ్రద్ధ. భిలాయ్లోనే కాదు.. పక్క జిల్లాల్లోనూ జరిగే వేడుకలకు ముందే పేరు నమోదు చేసుకునే అవకాశం కల్పించారు.
"ప్లాస్టిక్ ద్వారా ప్రకృతికి చాలా నష్టం జరుగుతుందని వార్తల్లో విన్నాను. భూమి ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల క్షీణిస్తుందని తెలుసుకున్నా. ఆవులు కూడా ప్లాస్టిక్ కవర్లను తిని అనారోగ్యం పాలవుతున్నాయి. అందుకే ప్రకృతి కోసం ఏదో ఒకటి చేయాలని అనిపించింది."
-శ్రద్ధ సాహు, సామాజిక కార్యకర్త
ఇలా స్టీల్ సామగ్రి ఇవ్వటం వల్ల భూమిలో విచ్ఛిన్నం కాని గ్లాసులు, ప్లేట్ల లాంటి ప్లాస్టిక్ వ్యర్థాలు తగ్గటం సహా వాటితో కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన పెరుగుతుందని అంటున్నారు శ్రద్ధ.
"నేను సామాజిక కార్యకర్తను. మా సంఘంలో చిన్న కార్యక్రమాలు జరుగుతుంటాయి. వాటిల్లో ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగా ఉండేది. అందువల్ల ఒక్కసారే స్టీల్ సామగ్రి కొనుగోలు చేస్తే ఎప్పటికీ ఉపయోగపడతాయని ఆలోచించాను. పర్యావరణ సంరక్షణకూ ఉపయోగపడుతుందని కొన్ని స్టీల్ గిన్నెలు కొనుగోలు చేశాం.
వేరే వాళ్లను కూడా వారి కార్యక్రమాలకు వీటిని తీసుకువెళ్లొచ్చని చెప్పాను. మీకు ప్లాస్టిక్ వ్యర్థాలతో ఎలాంటి ఇబ్బంది ఉండదని సూచించాను. అందరూ సానుకూలంగా స్పందించి ప్రతి కార్యక్రమానికి తీసుకెళ్లడం ప్రారంభించారు. అప్పటి నుంచి ఎక్కడికి వెళ్లినా వారికి ఈ విషయం చెప్పి ప్రచారం చేస్తాను."
-శ్రద్ధ సాహు, సామాజిక కార్యకర్త
పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు ప్లాస్టిక్ వ్యర్థాలు కలిగించే హాని గురించి అవగాహన కల్పిస్తున్నారు శ్రద్ధ. ప్రయత్నం చిన్నదే అయినా హరిత, ప్లాస్టిక్ రహిత భారత్ కోసం ఆమె చేసిన ఆలోచన యువతలో స్ఫూర్తి నింపుతోంది.