భాజపాపై బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్వలాభం కోసం విభజన రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. బంగాల్లో అన్ని వర్గాల ప్రజలు సామరస్యంతో జీవిస్తారని పేర్కొన్నారు. అలాంటి రాష్ట్రం.. మహాత్మా గాంధీ హంతకులకు ఎప్పటికీ తలవంచదని వ్యాఖ్యానించారు.
పశ్చిమ మెదినీపుర్లో నిర్వహించిన ఓ ర్యాలీలో పాల్గొన్న మమత.. రైతుల పట్ల కేంద్రం ఉదాసీన, అహంకార వైఖరి అవలంబిస్తోందని దుయ్యబట్టారు. ప్రజావ్యతిరేకంగా ఉన్న వ్యవసాయ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. భాజపా అధికార దుర్వినియోగంపై మౌనం వహించే బదులు జైలుకెళ్లేందుకే మొగ్గుచూపుతానని అన్నారు.
"బంగాలీ, బంగాలీయేతర రాజకీయాలను మేం నమ్మం. భాజపాలా హిందు-ముస్లిం రాజకీయాలనూ విశ్వసించం. అన్ని వర్గాల ప్రజలంతా సామరస్యంగా జీవించే చరిత్ర రాష్ట్రానికి ఉంది. మహాత్మా గాంధీ హంతకుల ముందు రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ తల వంచరు."
-మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి
బయటి నుంచి వచ్చి, రాష్ట్రంలో హింస సృష్టించే గూండాలకు వ్యతిరేకంగా పోరాడాలని భాజపాను ఉద్దేశించి ప్రజలకు పిలుపునిచ్చారు మమత. బంగాల్ను వారు తమ చేతుల్లోకి తీసుకొనేందుకు అనుమతించనని అన్నారు. తమ ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చేందుకే భాజపా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. "రఫేల్ కుంభకోణం, పీఎం కేర్స్ నిధుల విషయం ఏమైంది?" అంటూ కేంద్రాన్ని ప్రశ్నించారు. పీఎం కేర్స్ నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.