మహారాష్ట్రలో రాజకీయ వేడి మధ్యప్రదేశ్‌ను సైతం తాకింది. దీంతో అక్కడ సైతం రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్ పార్టీ యువనేత జ్యోతిరాదిత్య సింధియా తన ట్విటర్ ఖాతాలో కాంగ్రెస్ పార్టీ పేరును తొలగించడమే ఇందుకు కారణం. దీంతో ఆయన పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్నారని, ఆయన పార్టీ వీడతారంటూ ప్రచారం ఊపందుకుంది.
కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సింధియా తన ట్విటర్ ఖాతాలో ‘కాంగ్రెస్’ అనే పేరును తొలగించి కేవలం ‘ప్రజా సేవకుడు’, ‘క్రికెట్ ప్రేమికుడు’ అనే పదాలను మాత్రమే ఉంచారు. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీని వీడతారన్న ప్రచారం సోషల్‌మీడియాలో జోరుగా సాగింది. మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్‌తో ఆయనకు ఉన్న విభేదాలే అందుకు కారణమని ప్రచారం వ్యాప్తిలోకి వచ్చింది. దీనిపై సింధియానే స్వయంగా స్పందించారు. తాను ట్విటర్ బయో మార్పు చేసి నెల రోజులు అవుతోందని, బయోడేటా పెద్దగా ఉండడంతోనే తాను మార్చానని వివరణ ఇచ్చారు. పార్టీ మార్పుపై వస్తున్న ఊహాగానాలను కొట్టిపారేశారు.
కాంగ్రెస్ వర్సెస్ భాజపా
సింధియా ట్విటర్‌లో బయోడేటా మార్పుపై కాంగ్రెస్, భాజపాల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. పార్టీలో సంతోషంగా లేకనే ట్విటర్ బయో మార్చారని భాజపా పేర్కొంటుండగా.. అలాంటిదేమీ లేదని కాంగ్రెస్ పార్టీ వివాదాన్ని చల్లార్చే ప్రయత్నం చేస్తోంది. భాజపాకు చెందిన మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సైతం గతంలో తన ట్విటర్ ఖాతాలో మార్పులు చేశారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నరేంద్ర సలుజ పేర్కొన్నారు. అయినా ఎప్పుడో నెల క్రితం మార్చినదానికి లేని పోని రాద్ధాంతం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి విధేయుడని, పార్టీ మారే అవకాశమేదీ లేదని ఆయన ధీమా వ్యక్తంచేశారు.
పార్టీలో అసంతృప్తి కారణంగానే ట్విటర్ బయో మార్చారని భాజపా అధికార ప్రతినిధి దీపక్ విజయ్ వర్గీయా పేర్కొన్నారు. ప్రభుత్వ పనితీరుపై సింధియా అసంతృప్తితో ఉన్నారని ఆరోపించారు. సింధియా బంధువులైన వసుంధర రాజే సింధియా, యశోధర రాజే భాజపాలో ఉన్నత స్థానాల్లో ఉన్నారని, సింధియా అమ్మమ్మ కూడా భారతీయ జనసంఘ్‌కు చెందిన వ్యక్తేనని గుర్తుచేశారు. సింధియా తండ్రి బీజేఎస్‌లో కొంతకాలం పనిచేశారని ప్రస్తావించారు.
230 స్థానాలున్న మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ 115 (మెజార్టీకి ఒక్కస్థానం తక్కువ) స్థానాలు గెలుచుకుంది. దీంతో ఇద్దరు బీఎస్పీ, ఒక ఎస్పీ, నలుగురు స్వతంత్రుల మద్దతుతో ప్రభుత్వం నడుపుతోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి పదవి విషయంలో సింధియా పేరు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. తీరా ఫలితాలు వచ్చాక ఆ పదవిని సీనియర్ నేత కమల్‌నాథ్‌కు అధిష్ఠానం కట్టబెట్టింది. దీంతో సింధియా ఒకింత అసంతృప్తికి లోనయ్యారు.